Shobitha: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసిన కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో వివరాలు వెల్లడించారు. నటనకు దూరమవడం, అవకాశాల లేకపోవడం ఆమె జీవితంలో ఒత్తిడిని పెంచి ఆత్మహత్య దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
విచారణ ప్రకారం, శోభితది ఆత్మహత్య అని స్పష్టమైంది. ఆమె మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు, పరిసరాలను గమనించిన తర్వాత ఆత్మహత్యే కారణమని తేల్చారు. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు కూడా శోభిత మరణంపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు.
శోభిత రాసిన డైరీలో ఏమైనా కీలక సమాచారం ఉందా? లేదా ఆమె స్నేహితులకు చివరి సందేశాలు పంపించిందా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత జీవితం, కెరీర్ ఒత్తిడులు కలిసి ఆమెను ఈ దారుణ నిర్ణయానికి దారితీసినట్లు కనిపిస్తున్నా, దీనిపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించేందుకు విచారణను ముమ్మరం చేశారు. పోస్టుమార్టం అనంతరం శోభిత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించినట్లు డీసీపీ తెలిపారు.