సినిమా అంటే సెట్‌లు, కెమెరాలు, స్టార్ కాస్ట్, లొకేషన్లు, వందలమంది యూనిట్ అనేది ఇప్పటివరకు మన ఊహ. కానీ, తాజాగా కర్ణాటకకు చెందిన ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ పరంపరను పూర్తిగా మార్చేశారు. కేవలం ఒక గదిలో, రెండు మూడు కంప్యూటర్లతో ‘లవ్ యు’ అనే చిత్రాన్ని ఏఐ సాయంతో రూపొందించారు. ఈ సినిమాకు ఖర్చు మొత్తం రూ.10 లక్షలు మాత్రమే! ప్రీ రిలీజ్ ఈవెంట్‌కన్నా తక్కువ బడ్జెట్‌తో సినిమా పూర్తయ్యింది. ‘యు/ఏ’ సర్టిఫికేట్‌తో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ, ఇండియాలో తొలి ఏఐ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది.
ఇలాంటి ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. చైనాలో తీసిన ‘పైరేట్ క్వీన్’ అనే సినిమా, హాలీవుడ్‌లో రూపొందుతున్న ఏఐ ప్రాజెక్ట్స్ అన్నీ ఔట్‌పుట్ పరంగా మనం చూశాక ఆశ్చర్యానికి గురవుతాం. ఇక ఇవి కేవలం ప్రయోగాలుగా కాకుండా రాబోయే రోజుల్లో ఒక పటిష్ట ఆప్షన్‌గా మారిపోతాయన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టార్ రెమ్యునరేషన్‌లు, షూటింగ్ ఖర్చులు, ప్రమోషన్ బడ్జెట్ వంటి అడ్డంకులను పూర్తిగా తొలగించగలిగే శక్తి ఏఐకు ఉంది.
ఇండస్ట్రీలో ఏఐ వాడకంపై ఇప్పుడు ఆలోచనలు మొదలవుతున్నాయి. ఒకవేళ నటీనటుల అవసరం లేకుండా ఏఐ పాత్రలతో సినిమాలు తయారయ్యే దశకు వెళ్లితే, ఎంతోమంది నటుల భవిష్యత్‌పై ప్రశ్నార్థక చిహ్నం పడనుంది. సాంకేతిక నిపుణుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం తప్పదు. ఇది ఉత్సాహకరమైన మార్పు అయినప్పటికీ, ప్రమాదకరమైన ప్రవాహం కావచ్చనే భయం కూడా లేదు కాదు.
ఇప్పట్లో తెలుగు పరిశ్రమపై పెద్ద ప్రభావం కనిపించకపోయినా, భవిష్యత్తును నిర్లక్ష్యం చేయలేం. ఓటీటీ వచ్చాక థియేటర్లు ఎటూ పోతాయన్న భయాలు వచ్చాయనుకోండి… ఇప్పుడు ఏఐ ట్రెండ్ కూడా అలాగే మొదలవుతోంది. అయితే ఈ మార్పులను అంగీకరించడమే కాకుండా, వాటిని నియంత్రిస్తూ సహజంగా ముందుకెళ్లడం సినిమా పరిశ్రమకు మేలు చేస్తుంది. మొత్తానికి, ఓ గదిలోనే సినిమా తీయగలిగే రోజులు వచ్చాయన్నది నిజం. ఇప్పుడు తెలుగు సినిమా ఏ మార్గాన్ని ఎంచుకుంటుందనేదే ఆసక్తికర విషయం.