పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం ‘కల్కి’. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాదు.. ఇటీవలకాలంలో రూ.వెయ్యి కోట్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించింది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కమల్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ రెండో భాగంలో చాలా కీలకం కాబోతోంది. సైన్స్ ఫిక్షన్ కు పురాణాలను ముడిపెట్టిన దర్శకుడి ఆలోచన అందరికీ నచ్చింది. దీంతో రెండో భాగం ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ తన విలనిజాన్ని ఎలా పండించాడు అనేది తెలుసుకోవాలంటే రెండో భాగం విడుదలయ్యేంతవరకు ఎదురుచూడాల్సిందే.
ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ముందుగా కమల్ ను సంప్రదించగా తర్వాత చెబుతాను అన్నారుకానీ నటిస్తాను అని కచ్చితంగా చెప్పలేదు. దీంతో దర్శకుడు కమల్ నటించనంటే ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. చివరకు ఆయన మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వైపు మొగ్గుచూపారు.
కమల్ చేయనంటే ఆ పాత్రకు ఆయన బాగా న్యాయం చేస్తాడని భావించారు. అయితే ఈలోగానే కమల్ కబురు పంపారు. తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు భారీగా పారితోషికం ఇచ్చారు. ఒకరకంగా మోహన్ లాల్ చేసినా ఈ సినిమాకు బాగా కలిసివచ్చేదని, కమల్ నటిస్తానని చెప్పడంతో మోహన్ లాల్ కు మిస్సయిందంటున్నారు.
రెండో భాగంలో పురాణ కథలతో కమల్ పాత్రను ముడిపెట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలకు లింకు ఏమిటా అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. మొదటిభాగం కన్నారెండో భాగం బాగా ఆడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.