కాజల్‌ ‘సత్యభామ’ జూన్‌ 7కు వాయిదా..

మే 31న సుమారు అరడజనుకు పైగా సినిమాలు విడుదలవుతాయయనుకుంటున్న సమయంలో అందులో ఒక్కో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. సుధీర్‌ బాబు నటించిన ‘హరోం హర’ మే 31న విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు ఆ సినిమా జూన్‌ 14న విడుదలవుతుంది. ఇప్పుడు ఇంకో సినిమా కూడా విడుదల వాయిదా వేశారు. కాజల్‌ అగర్వాల్‌ పోలీసు పాత్రలో నటించిన ‘సత్యభామ’ సినిమా కూడా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ జూన్‌ 7 అని అధికారికంగా ప్రకటించారు.

మే 31న ఎక్కువ సినిమాలు విడుదలకి ఉండటంతో, అందరితోపాటుగా ఎందుకు పోటీ అని జూన్‌ 7 కి ఈ ‘సత్యభామ’ ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ విడుదల వేడుక మాత్రం యధావిధిగా జరుగుతుందని చెపుతున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిధిగా వచ్చి ఈ సినిమా ప్రీ విడుదల వేడుకలో పాల్గొంటారని చెప్పారు.

‘భగవంత్‌ కేసరి’ సినిమా విజయం తరువాత కాజల్‌ అగర్వాల్‌ చేస్తున్న సినిమా ఈ ‘సత్యభామ’. సుమన్‌ చిక్కాల దర్శకుడు, నవీన్‌ చంద్ర ఒక ముఖ్యమైన పాత్రలో కనపడనున్నాడని తెలుస్తోంది. కాజల్‌ అగర్వాల్‌ ఇందులో ఒక పవర్‌ ఫుల్‌ పోలీసు పాత్రలో నటించింది. ఈ చిత్ర ప్రచారాలు విరివిగానే చేస్తున్నారు, కాజల్‌ ఈ సినిమాని తన వ్యక్తిగతంగా తీసుకొని మరీ ప్రచారాలు చేస్తున్నట్టుగా వినికిడి. ‘మేజర్‌’ లాంటి అద్భుతమైన సినిమాకి దర్శకత్వం వహించిన, శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకి సమర్పకుడు, అలాగే కథనం కూడా అందిస్తున్నారు.