సోషల్ మీడియా.. యూట్యూబ్.. బుల్లితెర.. వెండితెర.. ఇలా వేదిక ఏదైనా తమలో ఉన్న టాలెంట్ ని పదిమందికి తెలియజేయడమే అంతిమ లక్ష్యం. అలా తనలో ఉన్న ప్రతిభను ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నారు నటి వనితా ఖరత్. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ ఇంట్లో వంట మనిషిగా నటించారు వనితా. ఈ సినిమాలో పుష్ప అనే పాత్రలో ఎంతో చక్కగా నటించి.. నవ్వించి అభిమానుల్ని సొంతం చేసుకున్నారు వనితా ఖరత్. ఈమె ఓ మరాఠి నటి.. మరాఠీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వనితా ఎన్నో నాటకాల్లో, సినిమాల్లో, సీరియల్స్ లో నటించి పేరు సంపాదించుకుంది.
ఇప్పుడామె 2021 క్యాలెండర్ కోసం ఓ ఫోటో షూట్ లో భాగంగా.. నగ్నంగా పోజులిస్తూ.. శరీర అనుకూలత గురించి.. నిజమైన వ్యక్తిత్వం, అందం పట్ల తనకున్న అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంది. వనిత ఈ ఫోటోలున్న క్యాలెండర్ ని తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో తనను తాను ఓ గాలిపటంతో కప్పేస్తూ.. ఎంతో స్వచ్చంగా, హాయిగా నవ్వుతూ కనిపిస్తుంది. ఎంతో నమ్మకంతో, స్టైల్ గా ఈ ఫోటోషూట్ కి పోజులిచ్చారు వనిత. ఈ ఫోటోకి క్యాప్షన్ ఇస్తూ.. తాను తన ప్రతిభకు ఎంతో గర్వపడుతున్నా.. తన ఇష్టాఇష్టాలు, తన నమ్మకం, తన శరీర తత్వం, ముఖ్యంగా తన వ్యక్తితం పట్ల ఎంతో గర్విస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది.
వనిత ఖరత్ పలు సినిమాల్లో, మరాఠీ టీవీ కామెడీ షోస్ లో నటించింది. వనిత కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ని ప్రారంభించారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. దీంతో వనితా, కబీర్ సింగ్ సినిమా తర్వాత మరింత పాపులరిటీ సంపాదించుకున్నారు.