తాజాగా ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చి ఆకట్టుకున్నారు జ్యోతిక. తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటించిన ఆమె బాలీవుడ్‌లో మాత్రం 27 ఏళ్ల తర్వాత నటించారు. 1997లో జ్యోతిక నటించిన హిందీ చిత్రం విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘సైతాన్’ అనే సినిమాతో ఈ ఏడాది బీటౌన్ ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాంగ్ గ్యాప్ రావడానికి గల కారణాన్ని వివరించారు.
‘తొలి చిత్రం ఫలితంపైనే మన కెరీర్ ఆధారపడి ఉంటుందని బలంగా నమ్ముతాను. నేను నటించిన మొదటి హిందీ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఫలితంగా నాకు అక్కడ అవకాశాలు రాలేదు. దక్షిణాదిలో నేను నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందాను. అయినా.. బాలీవుడ్ నుంచి ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ప్రేక్షకులు నన్ను దక్షిణాది నటిగానే గుర్తుంచుకున్నారు. అందుకే నాకూ బాలీవుడ్ చిత్రాల్లో నటించాలని ఆసక్తి లేదు’ అని చెప్పారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘శ్రీకాంత్’లో జ్యోతిక టీచర్ పాత్రలో కనిపించారు. సూర్య హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో జ్యోతిక నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘బెంగుళూరు డేస్’ ఫేమ్ అంజలి మీనన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జ్యోతిక దీనిగురించి మాట్లాడుతూ సరైన స్క్రిప్ట్ కోసం చర్చలు జరుపుతున్నామన్నారు. మంచి కథ ఉంటే సూర్యతో కచ్చితంగా కలిసి నటిస్తానని స్పష్టంచేశారు.