కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలని కబళిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కరోనాతో కన్నుమూయగా, ఆయన మరణం అభిమానులతో పాటు కుటంబ సభ్యులలో తీరని విషాదాన్ని నింపింది. అంత పెద్ద లెజండరీ సింగర్ కరోనా మృతి చెందడం ఎవరికి మింగుడుపడడం లేదు. అయితే బాలసుబ్రహ్మణ్యం మరణించిన కొద్దిరోజులకే టాలీవుడ్ హీరో రాజశేఖర్ తన కుటుంబం మొత్తానికి కరోనా సోకినట్టు ప్రకటించాడు. కూతుళ్ళు శివానీ, శివాత్మిక కరోనా నుండి త్వరగానే కోలుకున్నప్పటికీ, రాజశేఖర్ దంపతులు ఇద్దరు ఆసుపత్రిలోనే ఉన్నారు.
ఇటీవల జీవితకు రిపోర్ట్స్‌లో నెగెటివ్ రావడంతో ఆమె డిశ్చార్జ్ అయింది. రాజశేఖర్ మాత్రం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషమిస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం పలు వార్తలు రాగా, అభిమానులు ఆందోళన చెందారు. పలువురు సినీ ప్రముఖులు రాజశేఖర్ కరోనాని జయించి త్వరగా కోలుకోవాలని ప్రార్దించారు. చిరంజీవి సైతం తన ట్విట్టర్ ద్వారా నా స్నేహితుడు త్వరగా కోలుకుంటాని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్న రాజశేఖర్ ఆరోగ్యం క్రమక్రమేపి మెరుగవ్వడం ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం రాజశేఖర్ ఆరోగ్యం ప్రతీ రోజు అంతకంతకు మెరుగవుతున్నట్టు తెలుస్తుంది.రాజశేఖర్ సతీమణి జీవితా చెబుతున్న దాని ప్రకారం ఇపుడు రాజశేఖర్ ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, కరోనా వైరస్ వలన శరీరంలో కలిగిన ఇన్ఫెక్షన్ తగ్గిందని ఆమె చెప్పారు. అలాగే పలు పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్‌కు తరలించనున్నారని ఆమె తెలిపారు.రాజశేఖర్ త్వరగా కోలుకొని క్షేమంగా బయటకు రావాలని మనమంతా కోరుకుందాం.