చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సిన బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో, జపాన్‌కు చెందిన ఇవావో హకమడ జీవితమే ఇందుకు నిదర్శనం. 1966లో జరిగిన నలుగురు కుటుంబసభ్యుల హత్య కేసులో దోషిగా అభియోగం మోపబడిన హకమడ (ప్రస్తుతం 89 ఏళ్లు) తనపై తాను చేయని నేరానికి 46 ఏళ్లు జైల్లో గడిపాడు. విచారణా దశలో పోలీసులు చిత్రహింసలకు గురి చేసి అతనితో బలవంతంగా ఒప్పుకోలు పొందారని అతని న్యాయవాదులు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి అతని మీద ఉన్న ఆధారాలు చాలావరకు తారుమారు చేయబడ్డవని తర్వాత విచారణలో తేలింది.
ఈ కేసులో కీలకంగా నిలిచిన అంశం ఏమిటంటే.. రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు హకమద్‌దిగా చూపించడం. కానీ అవి అతనివే కాదని, వాస్తవానికి పోలీసులే కావాలనే ఉద్దేశంతో నాటకీయంగా దుస్తులను చూపించారని న్యాయవాదులు వాదించారు. 1968లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కానీ దశాబ్దాల విచారణల తర్వాత, 2024లో మరొకసారి విచారణ జరిపిన కోర్టు, హకమడ నిర్దోషి అనే విషయాన్ని అంగీకరించి విడుదల చేసింది.
తాను కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందడం అసాధ్యం అయినా… ప్రభుత్వం రూ.20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. జీవితంలో అత్యంత విలువైన నలభై ఆరేళ్లు జైలు గదిలో గడిపిన వ్యక్తికి ఇది కొంతమేర న్యాయంగా మారింది. శిక్ష అనుభవించాల్సింది నేరస్తుడు అయితే, హకమద్‌కి శిక్ష పడింది సిస్టమ్ చేసిన తప్పు వల్ల. ఈ ఘటన న్యాయవ్యవస్థలో నిర్దోషులకు కూడా శిక్ష పడే ప్రమాదం ఎంత ఘోరంగా ఉంటుందో తెలియజేస్తుంది.