తెలుగులో జాన్వీ కపూర్ మూడో ప్రాజెక్ట్ కూడా కన్ఫామ్.?

తెలుగులోకి తెరంగేట్రమైతే ఆలస్యమయ్యిందిగానీ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తల్లి శ్రీదేవి తరహాలోనే, హిందీతోపాటుగా తెలుగు, తమిళ భాషల్లోనూ నటించాలనే ఆలోచన జాన్వీ కపూర్ చేస్తోందిట. తొలుత హిందీ, ఆ తర్వాత తెలుగులో.. జాన్వీ కపూర్ ప్లానింగ్ ఒకింత ప్రత్యేకం.. వ్యూహాత్మకం కూడా.! ప్రస్తుతానికైతే తమిళంలో తెరంగేట్రంపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది జాన్వీ కపూర్.

‘దేవర’లో జూనియర్ ఎన్టీయార్ సరసన నటిస్తోంది జాన్వీ. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘దేవర’ సినిమాని రెండు పార్టుల్లో రూపొందిస్తున్నారు. దీన్ని మూడు పార్టులుగా చేసే అవకాశమూ లేకపోలేదు.

ఇంకోపక్క, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా కమిట్ అయ్యింది జాన్వీ కపూర్. ఇటీవలే జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ధృవీకరించిన సంగతి తెలిసిందే.

కాగా, జాన్వీ కపూర్ మరో ప్రాజెక్ట్‌కి చూచాయిగా ఆమోదం తెలిపిందని అంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడట. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన ఆ యంగ్ హీరో, బ్యాక్ టు బ్యాక్ పెయిల్యూర్ సినిమాలే చేశాడు ఇప్పటిదాకా.

ఓ ప్రాజెక్ట్ మాత్రం మమ అన్పించింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఆ హీరో కొత్త సినిమా వుండబోతోందట. సొంత బ్యానర్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ అట అది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.