2020 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఉన్న కళ ఆ తర్వాత లేకపోయింది. కరోనా కారణంగా మార్చ్ మూడవ వారం నుంచి పరిస్థితులన్ని మారిపోయాయి. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి థియోటర్స్ మూతపడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు థియోటర్స్ లో బొమ్మ పడిందే లేదు. ఇటీవల ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నప్పటికి శీతాకాలం కావడంతో ఇప్పుడు థియోటర్స్ ఓపెన్ చేయడం సరైన నిర్ణయమేనా అన్న చర్చలు జరుగుతున్నాయి.
మొన్న దసరా పండుగకే థియోటర్స్ ఓపెన్ అయి సినిమాలు రిలీజవుతాయని భావించారు. కాని అందుకు సాహసించలేకపోయారు. ఆ తర్వాత దీపావళి అంటున్నారు. కాని అది కూడా కుదిరే పని కాదన్న మాట వినిపిస్తుంది. ఇక ఈ ఏడాదిలో డిసెంబర్ 25 న థియోటర్స్ ఓపెన్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తారా ..అంటే ఈ విషయంలోను పూర్తిగా క్లారిటీ రావడం లేదు.
కాని టాలీవుడ్ మేకర్స్ మాత్రం సంక్రాంతికి తమ సినిమాలని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే పెద్ద సమస్య కూడా ఉందని అంటున్నారు. సంక్రాంతికి సినిమాలు చేస్తే ఎన్ని సినిమాలు రిలీజ్ చేయాలి. ఇందుకు తగ్గ ప్రణాళిక సరిగ్గా వేసుకున్నారా అన్నది.. చాలామంది మనసులో మెదులుతుందట.
అందుకు కారణం ఒకేసారి 5-6 సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్నదే కొందరి అభిప్రాయం. నాగ చైతన్య లవ్ స్టోరీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్, రాం నటించిన రెడ్.. రవితేజ నటించిన క్రాక్.. నితిన్ నటించిన రంగ్ దే.. అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ .. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. కాని ఇన్ని సినిమాలని రిలీజ్ చేస్తే పెద్ద ప్రమాదమూ ఉందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.