సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా మారుతు తెరకెక్కించిన సినిమా ఉప్పెన. మెగా హీరో వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి జంటగా నటించారు. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. కాగా బుచ్చిబాబు సానా డెబ్యూ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని ఫస్ట్ డే మంచి వసూళ్లను రాబట్టింది. ఊహించని విషయంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడం తో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో ఉప్పెన చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ సమావేశంలో ‘ఉప్పెన’ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘ఇది సునామీ లాంటి విజయం.. మళ్ళీ చెప్తున్నా 100 కోట్ల సినిమా అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ముందు నుంచి దర్శకుడు సుకుమార్ ఈ సినిమా మీద ఇలాంటి ధీమానే వ్యక్తపరుస్తూ వస్తున్నాడు. అందుకే ఓటీటి ఆఫర్ వచ్చినా ఒప్పుకోకుండా థియేటర్స్ రిలీజ్ కే నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ఉప్పెన మంచి హిట్ అన్న మాట వినిపిస్తోంది.
కాగా సుకుమార్ మాట్లాడుతూ .. బుచ్చిని ఎప్పుడు ఏరా ..ఏంట్రా అని పిలిచేవాణ్ణి. ఈ సినిమా చూసి బయటికొచ్చాక ఏరా బుచ్చి అని పిలవటానికి సంకోచించి.. బుచ్చి అన్నాను. అదే ఈ సినిమా సక్సెస్ కి నిదర్శనం. బుచ్చి మీద గౌరవం పెరిగింది. బుచ్చి రాసుకున్న కథని అద్భుతంగా తెరపైన చూపించాడు. నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ‘ఉప్పెన’ లాంటి అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను నిజమైన గురువుని చేశాడంటూ పొగడ్తలతో ముంచేశాడు. సినిమాకు సునామీ లాంటి హిట్ టాక్ వచ్చింది. నేను చెప్పినట్లు ఇది వంద కోట్ల సినిమా అని త్వరలో రుజువు కాబోతుంది” అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అయితే నిజంగా ఇది వంద కోట్ల సినిమా అవుతుందా అని కొందరు మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు ఇది సుకుమార్ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా.. అని కామెంట్ చేస్తున్నరని తెలుస్తోంది.