కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దాదాపు 7 నెలలుగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే థియోటర్స్ కూడా మూతపడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి. కాని ఇప్పటి వరకు రిలీజైన ఏ ఒక్క సినిమా కూడా భారీ హిట్ సాధించిన మాట వినిపించలేదు.
కాగా గత నెల నుంచి మళ్ళీ సినిమాలన్ని సెట్స్ మీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్, ఎన్.టి.ఆర్ – రాజమౌళి – చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ .. నాగార్జున వైల్డ్ డాగ్.. ఇలా చాలా సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అయితే దసరా పండుగ సందర్భంగా ఇప్పటికే రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు థియోటర్స్ లో సందడి చేస్తాయన్న భావనలో కొంతమంది ఉండగా అది సాధ్యపడలేదు.
కరోనా మూలంగా ఈసారి దసరా పండుగకు స్టార్ హీరోలు నటించిన సినిమాలేవీ విడుదల కాకపోవడంతో యూట్యూబ్.. సోషల్ మీడియాలో మన టాలీవుడ్ స్టార్ హీరోల సందడి భారీగా సాగుతోంది. తమ సినిమాల టీజర్స్ మోషన్ పోస్టర్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టైటిల్ అనౌన్స్ మెంట్స్, కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ తో హోరెత్తిపోతుంది.
ఈ క్రమంలోనే అభిమానులు తమ హీరోలకు సంబంధించిన టీజర్ రికార్డుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ లు క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో వ్యూస్ తో పాటు లైక్స్ ల రికార్డుల కోసం స్టార్ హీరోల ఫ్యాన్స్ చాలా తపన పడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి రామరాజు ఫర్ భీమ్ వీడియోకు నందమూరి ఫ్యాన్స్ కేవలం 24 గంటలలో మిలియన్ లైక్స్ తీసుకురావాలని గట్టిగా ప్రయత్నాలు చేసారు.
కానీ ఆ ప్రయత్నాలు కేవలం 70 వేల లైక్స్ తేడాతో 24 గంటల్లో మిలియన్ లైక్స్ రికార్డ్ మిస్ అయింది. దీనితో ఆ రికార్డును పవన్ అభిమానులు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ కు అత్యధిక లైక్స్, మిలియన్ లైక్స్ ను 24 గంటల లోపు సాధించాలని ట్రై చేస్తున్నారు.
అయితే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఆర్ ఆర్ ఆర్ నుంచి వచ్చిన రామరాజు ఫర్ భీమ్ వీడియో సాధించనిది ఇప్పటికే రెండు భాషల్లో రిలీజైన సినిమాకి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సాధిస్తుందా అని టాక్ నడుస్తోందట. అయితే ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారట. చూడాలి మరి ఏం జరగనుందో.