ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రాక్టీస్ సెషన్లపై బీసీసీఐ కీలక మార్పులు చేసింది. ప్రతి జట్టుకు కేవలం ఏడు ప్రాక్టీస్ సెషన్లు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. అలాగే, రెండు వార్మప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఇచ్చింది. మ్యాచ్ రోజు స్టేడియంలో ప్రాక్టీస్ చేసేందుకు వీలుకలిగించదని స్పష్టం చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే వేదికలపై ఇతర టోర్నీల నిర్వహణకు కూడా బీసీసీఐ బ్రేక్ వేసింది.
ఫ్లడ్ లైట్ల కింద ఒక జట్టుకు గరిష్టంగా 3.30 గంటల వరకు మాత్రమే ప్రాక్టీస్ అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రధాన స్క్వేర్‌కు అనుబంధమైన సైడ్ వికెట్‌లలో జరగాలని, అదనపు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలంటే బీసీసీఐ నుంచి ముందస్తు వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక హోమ్ మ్యాచ్‌లకు ముందు నాలుగు రోజుల పాటు ప్రధాన స్క్వేర్‌పై ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు లేదా మ్యాచ్‌లు నిర్వహించరాదని తెలిపింది.
ఒకేసారి రెండు జట్లు ప్రాక్టీస్ చేయాలనుకుంటే, ప్రత్యేక సెషన్లు కేటాయిస్తామని బీసీసీఐ నోట్‌లో వివరించింది. తాజా మార్పుల నేపథ్యంలో ఐపీఎల్ జట్లు తమ ప్రిపరేషన్‌లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సాధారణంగా సీజన్‌కు ముందుగా జట్లు గట్టి ప్రాక్టీస్ సెషన్లు, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతుంటాయి. కానీ తాజా నిబంధనల కారణంగా వారానికి పరిమిత ప్రాక్టీస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా, 2025 ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలిపోరు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య జరగనుంది. తాజా మార్పులు టీంలకు ఎంత వరకు అనుకూలిస్తాయో వేచి చూడాలి.