ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ అవకాశాలే లేని రాజస్థాన్ రాయల్స్ తమ చివరి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 187 పరుగులు చేసినా, రాజస్థాన్ ఆ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఛేదించి సీజన్‌ను గౌరవవంతంగా ముగించింది.
ఈ విజయానికి యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అర్ధశతకంతో ప్రాణం పోశాడు. కేవలం 33 బంతుల్లో 57 పరుగులతో ఆకట్టుకున్న అతనికి, కెప్టెన్ సంజు శాంసన్ (41) తోడుగా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (36) పవర్‌పుల్ ఆరంభం ఇచ్చాడు. చివర్లో ధ్రువ్ జురేల్ (31 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో రాజస్థాన్ దూకుడుగా గెలుపు అందుకుంది.
చెన్నై బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్‌లో చిత్తయిపోయింది. అశ్విన్ రెండు వికెట్లు తీయగా, అన్షుల్, నూర్ ఒక్కొక్క వికెట్ తీసారు. కానీ కీలక సమయంలో వారి ప్రయోగాలు ఫలించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కేలో ఆయుష్ మాత్రే (43) అద్భుతంగా ఆడినా, మిడిల్ ఆర్డర్ డిసప్ చేస్తూ స్కోరు నెమ్మదించింది. బ్రెవిస్ (42) స్పార్క్ ఇచ్చినా, జడేజా, ధోనీ, కాన్వే లు తక్కువ స్కోర్లతో వెనుదిరిగారు.
ఈ విజయంతో రాజస్థాన్ 14 మ్యాచ్‌లలో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నైకి ఇది పదో ఓటమి కాగా, వారు ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ధోనీ కెరీర్ చివరగా మిగిలిన ఒక్క మ్యాచ్‌లో అయినా చెన్నైకు గౌరవం తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు.