ఐపీఎల్ 2025 ఫైనల్ ఇప్పుడు కేవలం ఒక మ్యాచ్ కాదు… ఇది రెండు జట్ల కలల మధ్య తుది సమరంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగనున్న ఈ ఫైనల్‌ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎందుకంటే ఇంతవరకు టైటిల్ రాని రెండు జట్లు, ఓ విజయం కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నాయి.
RCB గెలవాలని కోహ్లీ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మూడు సార్లు చేజారిన కప్ ఇప్పుడు మాత్రం తమదవాలన్న కంఠస్వరాన్ని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మరోవైపు పంజాబ్ కూడా తమ రెండో ఫైనల్‌ను చివరి ఛాన్స్‌లా చూస్తోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేతిలో అదృష్టాన్ని వెతుక్కుంటోంది. ఇద్దరూ ఎప్పుడూ గెలవని ఫైనల్‌లో తలపడటం, ఇది ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి కావడం ఈ మ్యాచ్‌కి రారాజుగా నిలిపేస్తోంది.
ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే… క్వాలిఫయర్‌లో బెంగుళూరు చేతిలో పంజాబ్ ఓడింది. ఇప్పుడు అదే ఫలితం మళ్లీ దక్కుతుందా? లేక పంజాబ్ ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది. ఇక ఇది రెండు జట్లకు గానీ, అభిమానులకు గానీ కేవలం ఒక విజయం కాదు… గతంలో తడిచిన కన్నీళ్లకు తడిపిన ఆనందం కావాలి. ఒక టైటిల్ తో జీవితాంతం గుర్తుండిపోయే గర్వం కావాలి. ఈసారి ఎవరు గెలిచినా… వాళ్లకి ఇది ట్రోఫీ కంటే ఎక్కువ. అభిమానుల సహనం, ఆటగాళ్ల తపన, ఫ్రాంచైజీల విశ్వాసానికి ఇది బహుమతి. ఐపీఎల్ చరిత్రలో ఎన్నో ఫైనల్స్ జరిగాయి… కానీ ఈసారి జరగబోయేది మాత్రం ఒక ఎమోషనల్ క్లైమాక్స్. మరి తుది సమరంలో ఎవరు విజయాన్ని అందుకుంటారో చూడాలి.