టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఎప్పుడూ తన బ్యాటింగ్ స్టైల్‌తో ఆకట్టుకునే రింకూ.. ఇప్పుడు జీవితానికే ఓ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. రింకూ త్వరలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ను వివాహం చేసుకోనున్న విషయం ఇప్పుడు క్రికెట్, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ జంట నిశ్చితార్థ వేడుక జూన్ 8న లక్నోలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరగనుంది. గతంలో ప్రియ తండ్రి తుపాని సరోజ్‌నే స్వయంగా రింకూ-ప్రియల ప్రేమ కథను బయటపెట్టారు. ఏడాదిగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇరు కుటుంబాలూ వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా నిశ్చితార్థం ఫిక్స్ కావడం ఈ జంట అభిమానుల్లో హర్షాతిరేకం నింపింది.
ప్రియ సరోజ్ వయసు 25 సంవత్సరాలు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచిలీషహర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా రాజకీయాల్లో సత్తా చాటకముందు ఆమె న్యాయవాదిగా సుప్రీంకోర్టులో పనిచేశారు. ఈ మధ్యే రాజకీయ రంగ ప్రవేశం చేసి బలమైన ముద్ర వేసిన ప్రియ.. ఇప్పుడు క్రికెటర్ రింకూ జీవిత భాగస్వామిగా మారబోతున్నారు.
రింకూ సింగ్‌కు క్రికెట్ ప్రేమికులందరికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో బ్యాట్‌తో అద్భుతాలు చేసిన ఈ యువ క్రికెటర్.. ఇండియా టీ20 జట్టులో తళుక్కున మెరిసిపోతున్నాడు. హెలికాప్టర్ షాట్లు, ఫినిషింగ్ టచ్‌తో ఎంతోమందిని ఫిదా చేసిన రింకూ.. ఇప్పుడు ప్రియతో కలిసి జీవితాన్ని స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ జంట పెళ్లి తేదీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.