Actress Archana: ‘నిరీక్షణ’లో జాకెట్ లేకుండా నటించడం మామూలు విషయం కాదు.. : అర్చన

జాతీయ ఉత్తమ నటిగా రెండు సార్లు అవార్డు అందుకున్నారు ప్రముఖ నటి అర్చన. అలాంటి గొప్ప నటి అయిన అర్చన, నటికిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ చిత్రంలో రూపేశ్, ఆకాంక్ష సింగ్‌లు కీలక పాత్రలను పోషించారు. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించిన ఈ ‘షష్టిపూర్తి’ మే 30న విడుదల కానుంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఇంటర్వ్యూలకు, మీడియాకు దూరంగా ఉండే నటి అర్చనను ‘షష్టిపూర్తి’ కోసం పాటల రచయిత చైతన్య ప్రసాద్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ‘షష్టిపూర్తి’ గురించి నటి అర్చన చెప్పిన విశేషాలివే..

చైతన్య ప్రసాద్ : మీరు ఇన్ని భాషల్లో నటించారు? అసలు మీ మాతృభాష ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు?

అర్చన : నేను ఇంత వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ, ఇంగ్లీష్, ఒరియా భాషల్లో నటించాను. నేను ఏ భాషకు చెందిన వ్యక్తిని అనేది చాలా మందికి అనుమానం. మా అమ్మ గారిది తెలుగు. కానీ నా చిన్నప్పుడే చెన్నైకి షిఫ్ట్ అయ్యాం. అందుకే తమిళ్ కల్చర్‌కు అలవాటు అయ్యాం. కానీ అమ్మ వల్ల తెలుగు బాగా వచ్చింది.

చైతన్య ప్రసాద్ : మీరు చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. మీ బాల్యం ఎలా గడిచింది?

అర్చన : నేను ఒక మంచి డ్యాన్సర్ అవ్వాలని అనుకున్నాను. నటి అవ్వాలనే ఆలోచన లేదు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. కథక్, భరతనాట్యం, కూచిపూడి వంటి వాటిల్లో ప్రావిణ్యం ఉంది. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ప్రాణం. అమ్మాయి కళ్లు, పళ్లు బాగున్నాయి నటిస్తే బాగుంటుందని నన్ను ఇటు వైపు తోశారు. నాజర్, నేను విలియమ్ గ్రేస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో క్లాస్ మేట్స్. ఆయనే మా ఇద్దరినీ బాలు మహేంద్ర గారి దగ్గరకు తీసుకెళ్లారు. తెలుగులో నన్ను దాసరి నారాయణ గారు ఓ చిన్న పాత్రతో పరిచయం చేశారు. ‘నిరీక్షణ’ అనేది తెలుగులో హీరోయిన్‌గా నా మొదటి చిత్రం.

చైతన్య ప్రసాద్ : ‘నిరీక్షణ’ సినిమాను ఎన్ని సార్లు చూశామో కూడా గుర్తు లేదండి?

అర్చన : ‘నిరీక్షణ’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఆ మూవీని బాలు మహేంద్ర గారు మొదటగా మలయాళంలో తీశారు. అక్కడ మమ్ముట్టి, శోభన చేశారు. తెలుగులోకి వచ్చే సరికి ఓ ట్రైబల్ అమ్మాయిలా కనిపించే ఓ డస్కీ స్కిన్ అమ్మాయి కావాలని అన్నారు. అప్పట్లో బ్లౌజ్ లేకుండా నటించడం అనేది మామూలు విషయం కాదు. అయినా ఎక్కడా వల్గారిటీ (అసభ్యత) లేకుండా ఎంతో పవిత్రంగా చూపించారు. ‘నిరీక్షణ’లో అదే నాకు నచ్చిన అంశం. ఆ పాత్రను చేయడానికి నేను ఎప్పుడూ భయపడలేదు. పాత్రలోని పవిత్రతను మాత్రమే నేను చూశాను.

చైతన్య ప్రసాద్ : ఎక్కువగా పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలు, అవార్డ్ విన్నింగ్ సినిమాల్లోనే నటించారు కదా?

అర్చన : నా కెరీర్‌లో నేను మహా అంటే ఓ ముప్పై సినిమాలు చేసి ఉంటాను. కానీ ఇప్పటికీ నన్ను ఆడియెన్స్ గుర్తు పెట్టుకుంటున్నారు. నేను ఎప్పుడూ కూడా పాత్రకు ప్రాధాన్యం, సహజంగా ఉండే కారెక్టర్‌లను ఎంచుకుంటూ వచ్చాను. నేను ఒక స్టార్‌లా కాకుండా.. పక్కింటి అమ్మాయిలానే కనిపించేందుకు ఇష్టపడతాను. అందుకే నాకు అలాంటి నేచురల్ రోల్స్ వచ్చాయి. అందుకే తమిళంలో ‘వీడు’, తెలుగులో ‘దాసి’ చిత్రాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు వచ్చాయి. నేను అందరి ఇంట్లో ఓ ఫ్యామిలీ మెంబర్‌లా మారిపోయాను. గ్లామర్‌తో కాకుండా లుక్స్, నటనతో అందరినీ ఆకట్టుకోగలిగాను.

చైతన్య ప్రసాద్ : మేకప్ ఎక్కువగా వాడతారా?

అర్చన : ‘నిరీక్షణ’ చిత్రంలో అయితే మేకప్ వాడలేదు. పైగా ట్రైబల్ గర్ల్ అంటే మరింత డస్కీగా కనిపించాలి. ఇక ఈ ‘షష్టిపూర్తి’ చిత్రంలోనే మేకప్ వేసుకున్నాను. హీరో గ్లామర్‌గా ఉండటంతో.. తల్లి కూడా కాస్త గ్లామర్‌గా ఉండాలని కాస్త మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. కానీ నేను ఎక్కువగా మేకప్ వేసుకోను. పాత్రకు అవసరం అని చెబితే మాత్రం చాలా కాస్త తక్కువగానే వేసుకుంటాను.

చైతన్య ప్రసాద్ : మీరు ఎక్కువగా రెగ్యులర్, కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలని ఎందుకు చేయలేదు?

అర్చన : నాకు కమర్షియల్ చిత్రాలకంటే ఆర్ట్ ఫిల్మ్స్ అంటేనే ఎక్కువగా ఇష్టం. అలా అని ‘నిరీక్షణ’ అనేది ఆర్ట్ ఫిల్మ్ కాదు. కంప్లీట్ కమర్షియల్, ఫార్మాట్ సినిమా కాదు. చిన్నప్పటి నుంచి నా కథల్ని, నా సినిమాల్ని నేనే ఎంచుకునేదాన్ని. నాకు నచ్చినవి మాత్రమే చేసుకుంటూ వచ్చాను. ఒక వేళ మధ్యలో ఇబ్బంది అనిపించినా ఏదోలా సినిమాను కంప్లీట్ చేసి వచ్చేదాన్ని

చైతన్య ప్రసాద్ : సినిమాల్లో నటించినప్పుడు మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయా?

అర్చన : నాకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదు. ఒక రెండు రోజులు ఇబ్బంది కలిగినా మూడో రోజు నా గురించి తెలిసి.. వాళ్లంతా నా దారిలోకి వచ్చేవారు. నాకు ఎప్పుడూ అటువంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ‘షష్టిపూర్తి’ సినిమాకు మొదటి రోజు మాత్రమే నేను ఆర్టిస్ట్‌గా కనిపించాను. ఆ తరువాత రూపేశ్, ఆకాంక్షలకు అమ్మగా మారిపోయాను. అదే గౌరవం వాళ్లు కూడా నాకు ఇచ్చారు.

చైతన్య ప్రసాద్ : ‘లేడీస్ టైలర్’ కాంబినేషన్ తరువాత ఇన్నేళ్లకు మళ్లీ చేయడం ఎలా అనిపించింది?

అర్చన : డైరెక్టర్ పవన్, నిర్మాత రూపేశ్‌ల వల్లే ఈ కాంబో సెట్ అయింది. దర్శక, నిర్మాతలకు ఈ రోజుల్లో ఇలాంటి టేస్ట్, కమిట్మెంట్ ఉండటం మామూలు విషయం కాదు. వాళ్లు నన్ను అప్రోచ్ అవ్వడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇదేమీ చిన్న బడ్జెట్ చిత్రం కాదు. ఈ మూవీ కోసం హీరో, నిర్మాత రూపేశ్ చాలా కష్టపడ్డాడు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చాడు. మేం వచ్చామా? నటించామా? వెళ్లిపోయామా? అన్నట్టుగా ఉండేది. రూపేశ్‌కి సినిమా పట్ల ఎంత ఇష్టం, ప్యాషన్ ఉందో నాకు అర్థమైంది.

చైతన్య ప్రసాద్ : ఇళయరాజా గారితో మీకు ముందు నుంచీ అనుబంధం ఉంది కదా?

అర్చన : నా మొదటి చిత్రానికి కూడా ఇళయరాజా గారు సంగీతం అందించారు. ‘షష్టిపూర్తి’ చిత్రంలోనూ ఇళయరాజా గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులోని మ్యూజిక్, పాటలు ఎంతో ప్లెజంట్‌గా అనిపించింది. మీరు రాసిన పాటలు బాగున్నాయి. కీరవాణి గారు రాసిన పాట బాగుంది.

చైతన్య ప్రసాద్ : రూపేశ్ ఈ చిత్ర ప్రయాణంతో నాకు సొంత కొడుకులా మారిపోయాడు.. ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?

అర్చన : రూపేశ్ నాక్కూడా సొంత కొడుకులా మారిపోయాడు. అదే అతని నేచర్. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ పాత్రలోనూ ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి. ఓ ఆర్టిస్ట్‌గా రూపేశ్ ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డాడో, ఆ పాత్రలని, ఆ పాత్రలోని వేరియేషన్స్ చూపించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో రూపేశ్‌ని నేను చూశాను కాబట్టే ఇదంతా చెప్పగల్గుతున్నాను. రూపేశ్ గొప్ప యాక్టర్ అని చెప్పగలను.

చైతన్య ప్రసాద్ : దర్శకుడు పవన్ తన తల్లి ప్రభ పేరుని చివరన పెట్టుకున్నారు.. అక్కడే అతని మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతోంది కదా?

అర్చన : పవన్ నాతో ఓ మంచి మాట చెప్పారు. హీరోకి తల్లిగా ఓ పాత్రను తీసుకుంటే.. కొడుకు పక్కన ఉన్నప్పుడు ఆ పాత్ర తల్లిలానే కనిపించాలని.. ప్రేమికుడు పక్కన ఉన్నప్పుడు ప్రేయసిలా కనిపించాలని.. ఆహార్యం గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. అది చాలా విలువైన మాట. కొడుక్కి తల్లిని తల్లిగానే చూపించాడు. నాకు పవన్ మాటలు చాలా తృప్తిగా అనిపించాయి.

చైతన్య ప్రసాద్ : మీ కెరీర్‌లో ‘పిరవి’కి ఉన్న స్థానం ఏంటి?

అర్చన : షాజీ ఎన్. కరుణ్ అప్పటి వరకు ఎంతో మంది వద్ద కెమెరామెన్‌గా పని చేశారు. ఆ చిత్రంలో నేను ఓ పాత్రను పోషించాను. ‘పిరవి’ మూవీకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. అదే ఏడాది నేను నటించిన ‘దాసి’ చిత్రానికి ఐదు నేషనల్ అవార్డులు వచ్చాయి. మన ఇండియా నుంచి కేన్స్ ఫెస్టివెల్‌కు వెళ్లిన మొదటి చిత్రం కూడా ‘పిరవి’నే అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఆ చిత్రానికి చార్లి చాప్లిన్ అవార్డు కూడా వచ్చింది.

చైతన్య ప్రసాద్ : ‘దాసి’ చిత్ర అనుభవాల్ని పంచుకుంటారా?

అర్చన : ‘దాసి’ చిత్రమే ఓ అనుభవం. అది చాలా బోల్డ్ సినిమా, బోల్డ్ కారెక్టర్. ఘడిల్లో దాసి అనే వాళ్లు ఉండేవారు. కోడళ్లుగా వచ్చే వారు దాసిలని తెచ్చుకునేవారు. అలా వచ్చిన దాసిలపై అక్కడి మగవాళ్లంతా అత్యాచారాలు చేస్తుండేవారు. దాసి జీవితం అనేది చాలా భయంకరంగా ఉండేది. ఆ పాత్రను చాలా బోల్డ్‌గా చేయాల్సి వచ్చింది. బి. నర్సింగ్ రావు గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఆ టైంలో దర్శకులు ఏం చెబితే అది కళ్లు మూసుకుని చేసేవాళ్లం.

చైతన్య ప్రసాద్ : మీరు జాతీయ ఉత్తమ నటి, పెద్ద హీరోయిన్ కదా.. సెట్స్‌లో ఎలా ఉండేవాళ్లు?

అర్చన : హీరోయిన్‌ అవ్వకంటే ముందు నేను ఒక సాధారణ వ్యక్తిని. నేను మిడిల్ క్లాస్‌ నుంచి వచ్చాను. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లాలంటే రెండు బస్సులు మారి వెళ్లేదాన్ని. హీరోయిన్‌గా మారిన తరువాత కూడా అదే పద్దతిని అవలభించాను. నేను లైఫ్ స్టైల్‌ని ఎప్పుడూ మార్చుకోలేదు. అవార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. సక్సెస్ వస్తుంది.. పోతుంటుంది.. కానీ నేను నా ఐడెంటిటీని ఎప్పుడూ వదులుకోలేదు. ఈ ప్రపంచంలో నేనేమీ గొప్పదాన్ని కాదు.

చైతన్య ప్రసాద్ : మీ హాబీస్ ఏంటి?

అర్చన : నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఇప్పుడిప్పుడు మళ్లీ నటన మీద ఫోకస్ పెడుతున్నాను. ఇది ఏమీ నేను రీ ఎంట్రీ అనుకోవడం లేదు. నాకు నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో నాలుగైదు ప్రాజెక్టులు చేస్తున్నాను.

చైతన్య ప్రసాద్ : మీ అసలు పేరు ఏంటి?

అర్చన : నా అసలు పేరు సుధ. నేను ఇండస్ట్రీలోకి వచ్చే సరికి జయ సుధ అక్క చాలా పాపులర్ హీరోయిన్. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్. అందరూ ఆమెను సుధ అని పిలుస్తుండేవారు. సుధా అనే పేరుతో మళ్లీ నేను ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. అంత ఫేమస్ అయిన సుధక్క పేరులో నాకు ఓ భాగం వద్దు అని, నాకంటూ గుర్తింపు ఉండాలని బాలు మహేంద్ర గారిని పేరు విషయం గురించి అడిగాను. నా మాటలతో ఆయన కదిలిపోయారు. నీ సీనియర్ ఆర్టిస్ట్ మీద ఇంత గౌరవం ఉంది అని బాలు మహేంద్ర గారు చాలా గ్రేట్‌గా ఫీల్ అయ్యారు. ఆ తరువాత నాకు అర్చన అని బాలు మహేంద్ర గారు కొత్త పేరు పెట్టారు. జయసుధ గారికి జాతీయ అవార్డు రావాలని అనుకుంటే.. ఇప్పటికే ముప్పై, నలభై అవార్డులు వచ్చి ఉండాలి. ఆవిడ సహజనటి. ఆమె మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.

చైతన్య ప్రసాద్ : బాలు మహేంద్ర గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది?

అర్చన : ఒక రోజు సెట్‌లో ఒక లైట్ రాలేదు. సహజంగా లైట్ ఎక్కడ వచ్చిందో.. అక్కడికే తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ‘వీడు’ సినిమాలో ఇంటిని కట్టే సీన్‌లో పునాది వేయాలి. ఆ రోజు సీన్‌లో ఉదయం ఆరు గంటలకు ఎండ తీవ్రంగా స్టార్ట్ అయింది. ఏడున్నరకి మేఘాలు వచ్చాయి. చీకటి పడింది. సాయంత్రం ఆరుగంటలు అన్నట్టుగా మారింది. వర్షం పడుతుంది.. ఇక షూటింగ్ ఉండదు అని తెలిసీ తెలియని చిన్నతనంలో అనేశాను. ఆయన కెరీర్‌లో మొదటి సినిమా అది. మొదటి రోజే అలా వర్షం పడింది. ఆ వర్షంలోనే సినిమాను సహజంగా తీశారు. ఆయన నేచర్‌తో మమేకమై సినిమాను తీస్తుంటారు.

చైతన్య ప్రసాద్ : జాతీయ అవార్డులు వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది?

అర్చన : శ్యామ్ బెనెగళ్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో నాకు జాతీయ అవార్డు వచ్చింది. అసలు ఈ జాతీయ అవార్డులు ప్రారంభించిన తరువాత మొదటి సారి నాకు ‘వీడు’ సినిమాకు, కమల్ హాసన్‌కు ‘నాయగన్’కు ఉత్తమ నటి, ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి. అవన్నీ ఓ రికార్డులు. అప్పటికే కమల్ హాసన్ ఎన్నో వందల సినిమాలు చేశారు. నేను మాత్రం ఐదారు చిత్రాలు చేసే ఉన్నాను. గొప్ప గొప్ప ఆర్టిస్టులున్నా కూడా నాకు జాతీయ అవార్డు వచ్చింది.

చైతన్య ప్రసాద్ : మీలాంటి గొప్ప వారితో కలిసి పని చేసే అవకాశం నాకు వచ్చింది. ఇలాంటి గొప్ప సినిమాను రూపేశ్ అద్భుతంగా నిర్మించాడు. ఆయనకు సక్సెస్ రావాలని ఆశీర్వదించండి

అర్చన : రూపేశ్‌కు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. నాకు రూపేశ్ ఓ కొడుకులా మారిపోయాడు. అలాంటి వ్యక్తికి ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. మంచి లాభాలు రావాలి.

నిర్మాత, హీరో రూపేశ్ : ఈ చిత్రంతో మా అమ్మ అర్చన గారికి మూడో సారి జాతీయ అవార్డు వస్తుంది.

రూటు మార్చిన చంద్రబాబు | Truth Behind Chandrababu Success Story | YSR | TDP Vs YCP | Telugu Rajyam