దర్శక ధీరుడిగా రాజమౌళి కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి ఎప్పుడు సినిమా వస్తుందా అని అన్నీ చిత్ర పరిశ్రమలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా సత్త ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడిగా టాలీవుడ్ మొత్తం నీరాజనాలు పలికింది. ఈరోజు ప్రభాస్ కి పాన్ ఇండియన్ స్టార్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో క్రేజ్ వచ్చిందంటే అది ఈ దర్శక ధీరుడి వల్లనే.
అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మీద ఊహించని రేంజ్ లో అంచనాలున్నాయి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పోరాట యోధులుగా ఈ స్టార్ హీరోలు నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సమ్మర్ కి రిలీజ్ చేయాలని రాజమౌళి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. ఇప్పటికే భీం .. రామరాజు పాత్రలతో వచ్చిన టీజర్స్ కి దేశమంతా ప్రశంసలు కురిపించారు. అయితే రాజమౌళి ఒక్కో సినిమాకి కనీసం రెండేళ్ళు .. ఇంకా కాదంటే మూడేళ్ళ సమయం తీసుకుంటున్నాడు.
హీరోలు కూడా రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్ళు కేటాయించాల్సి వస్తోంది. ప్రభాస్ బాహుబలి సినిమా కోసం దాదాపు 4 ఏళ్ళ సమయం కేటాయించాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్.టి.ఆర్ – చరణ్ కూడా రెండేళ్ళు కేటాయించినట్టు అవుతోంది. దాని వల్ల మరొక సినిమా చేయలేకపోతున్నారు. అయితే ఇలా మహేష్ రెండేళ్ళ పాటు రాజమౌళి కి డేట్స్ ఇస్తాడా అన్నది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చకి వచ్చిందట. మహేష్ బాబు ఇప్పటి వరకు సినిమాకి 6 నుంచి 8 నెలలు మాత్రమే కేటాయిస్తున్నాడు.
అలాంటిది రాజమౌళి సినిమాకి రెండేళ్ళంటే అయ్యేపని కాదంటూ కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారట. మరి మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ విషయంలో అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. 2022 లో మొదలయ్యే అవకాశాలున్నాయని అంటున్నప్పటికి ఈ కాంబినేషన్ లో సినిమాకి పట్టాలెక్కడానికి ఇంకా ఎక్కువ సమయమే పడుతుందని మాట్లాడుకుంటున్నారట.