Chiranjeevi: ఎన్టీ రామారావు తర్వాత రాజకీయాల్లోకి ఒక నటుడొస్తున్నాడు.. మదర్ థెరిస్సా, అబ్దుల్ కలాం ఆశయాలతో ఒక మంచి చేయడానికి ఒక వ్యక్తి వస్తున్నాడని ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు పెట్టాలనుకున్నపుడు తామంతా అలాగే ఫీలయ్యామని పసునూరి శ్రీనివాసులు అన్నారు. అతను గెలిచాడా, ఓడాడా అనేది పక్కన పెడితే, ఆ పార్టీకి ఏమైందనేది పక్కన పెడితే ఆయన ఆలోచన మాత్రం మంచి చేయాలనే ఉండే అని శ్రీనివాసులు చెప్పారు. ఆ తర్వాత పరిస్థితులు ఏమయ్యాయో తెలియదు గానీ, ఆయన ఉద్దేశం మంచిదే ఉండేనని ఆయన అన్నారు.
ఆ సమయంలో చిరంజీవి గారు గనక సీఎం అయ్యి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఇంకెంత అభివృద్ధి ఉండేనో అని శ్రీనివాసులు అన్నారు. ఒక ఆశయంతో, ఒక మంచి ఆలోచనతో వచ్చాడు కదా అని తామంతా ఎంతో ఆకర్షితులమయ్యామని ఆయన స్పష్టం చేశారు. తాను ఆ పార్టీ ఓపెనింగ్‌కి తిరుపతి వెళ్లానని, అదే సమయంలో ఇక్కడ కూడా జెండా హోస్టింగ్ అన్నీ ఇక్కడ పార్టీ ఆఫీస్‌లో జరిపించామని ఆయన చెప్పారు. ఆయన ఆలోచనలతో ముందుకు వెళ్లాననే, ఆయనతో ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయినట్టు శ్రీనివాసులు తెలిపారు.
ఇకపోతే ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి చాలా రకాల కారణాలున్నాయని ఆయన చెప్పారు. ఏ పార్టీనైనా నడిపించాలంటే కొంత వరకు నిధులు అవసరమన్న ఆయన, అందులోనూ కొత్తగా పార్టీ పెట్టారు అని, అనుభవం కూడా దానికి చాలా అవసరమని ఆయన అన్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ లోటు వల్లనే ఆ సందర్భం వచ్చినట్టు ఆయన తెలిపారు. పార్టీని నడిపించడం అంత ఈజీ కాదన్న శ్రీనివాసులు, అధికారంలో ఉంటే పర్లేదు కానీ, ఒకవేళ రాకపోతే మాత్రం ఆ భారం మొత్తం అధినేతపైనే పడుతుంది కదా అని ఆయన చెప్పారు. అవన్నీ ఆలోచించాకే ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని ఆయన వివరించారు.