Sreekanth: అప్పట్లో ఫ్యామిలీ సినిమాలు తీస్తున్నపుడు గెటప్‌లు మార్చాలని అసలు తమకు తెలిసేది కాదని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. అన్ని సినిమాల్లోనూ ఒకేలా నటించేవాడినని ఆయన చెప్పారు. ఇప్పుడు చూస్తే అసలు అది ఏ సినిమాలోని గెటపో కూడా గుర్తుపట్టలేనని ఆయన నవ్వుతూ అన్నారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, చాలా మంది హెయిర్ స్టైలిస్ట్‌లు కూడా రావడంతో సినిమా సినిమాకీ గెటప్ మారిపోతుందని ఆయన తెలిపారు. ఇప్పుడు తాను తీస్తున్న సినిమాలకు మళ్లీ గెటప్ మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఉదాహరణకు అఖండ సినిమాలో చేసిన గెటప్ అలా, వివిధ గెటప్స్ చేస్తున్నానని ఆయన చెప్పారు. ప్రస్తుతం శంకర్ గారి దర్శకత్వంలో దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో రామ్ చరణ్ సినిమాలో చేస్తున్నానన్న ఆయన, దాంట్లో మళ్లీ ఒక గెటప్‌తో యంగ్‌గా కనిపిస్తానని ఆయన అన్నారు. తన హెయిర్‌నే వాడారు తప్ప విగ్గు లాంటివేమీ ఉపయోగించలేదని ఆయన తెలిపారు. ఇప్పుడు తాను జుట్టు పెంచడానికి కూడా అదే కారణం అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు హెయిర్ స్టైల్స్ అన్నీ మారుతున్నాయి కాబట్టి, ఇప్పుడు ఈజీ చెప్పొచ్చు ఏ సినిమాలోనిది గెటప్ అని శ్రీకాంత్ వివరించారు.
కెరీర్ ప్రారంభంలో తాను విలన్ క్యారెక్టర్స్ చేశానన్న ఆయన, కొద్ది రోజులకు హీరోగా చేసే అవకాశాలు వచ్చాయని ఆయన చెప్పారు. మళ్లీ ఇప్పుడు అఖండ సినిమాతో విలన్‌గా పరిచయం అయ్యానని ఆయన అన్నారు. ఇకపోతే ఇప్పటికీ తనకు హీరోగా అవకాశాలు వస్తున్నాయన్న ఆయన, ప్రస్తుతం తనకు రెండు సినిమాలు ఉన్నాయని శ్రీకాంత్ చెప్పారు. కానీ అది ఎంత కాలం, జనరేషన్ మారిపోతుంది, అన్నీ తెలుసుకోవాలి కదా.. అదీ కాక, అలా టెన్షన్ పడడం, డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, హ్యాపీగా ఇలా చేసుకుంటూ పోదామని తాను నిశ్చయించుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రోషన్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడన్న శ్రీకాంత్, ఈ సమయంలో తాను అన్ని క్యారెక్టర్స్ చేసుకుంటూ పోదామని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. హీరో అనే కాదు మంచి క్యారెక్టర్ ఏది అనిపించినా చేద్దామని డిసైడ్ అయ్యానని ఆయన చెప్పారు.