వాళ్ల గురించి అస్సలు పట్టించుకోను.. ఆ బ్యాచ్ నాది కాదు: బండ్ల గణేష్

బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు నిర్మాతగా విజయవంతంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే అతడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. సినిమా ఒక్కటే తనకు జీవితం కాదని.. అది అందులో ఒక భాగం మాత్రమే అని చెప్పుకొచ్చాడు. సినీ పరిశ్రమలోనే కాదు.. ఇటు రాజకీయంగా కూడా తనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారన్నారు.

అతడిపై కొన్ని సంవత్సరాల క్రితం దర్శకులు, హీరోలను మోసం చేశాడనే ఆరోపణ గురించి మాట్లాడుతూ.. తాను ఎవరినీ మోసం చేయలేదని.. ఆ మాటలు పచ్చి అబద్దం అంటూ చెప్పుకొచ్చాడు. అతడిపై గతంలో హీరో రవితేజను, దర్శకుడు కృష్ణవంశీని భూముల కొనుగోలు, అమ్మాకాల విషయంలో మోసం చేశాడనే ఆరోపణ ఉంది. దానిపై అతడు ఖండిస్తూ.. ఏం జరిగిందో చెప్పాడు. తన దగ్గర వాళ్లిద్దరు పొలం కొన్నారు..తర్వాత వాళ్లిద్దరు ఆ పొలాలను అమ్ముకున్నారన్నారు.

తాము వ్యాపారాలు చేశామని అది చాలా కాలం వరకు కొనసాగిందన్నారు. అంతే కాని మామధ్య ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశాడు. అయితే తాను తప్పుడు స్థలం అమ్మినట్లు వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఎవరైనా ప్రూవ్ చేస్తే.. దేనికైనా సిద్ధం అంటూ సవాల్ విసిరాడు. పనీపాట లేకుండా.. సాయంత్రం ఛాయ్ షాపుల వద్ద కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకునే వారి మాటలను నమ్మే స్థితిలో లేనని.. అటువంటి బ్యాచ్ నాది కాదంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

అస్సలు అలాంటివి పట్టించుకోనని అన్నారు. తన గురించి ఎదుటి వాళ్లు ఏం అనుకున్నా తనకు అనవసరం అన్నాడు. ఇక ఇప్పట్లో తనకు సినిమాలు తీసే ఆలోచన లేదని.. హీరోలను పాంపర్ చేయాల్సిన అవసరం తనకు అంతకన్నా లేదన్నాడు. మంచి కథ దొరికితే మాత్రం దానికి తగ్గ హీరోతో సినిమా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. తన బయోపిక్ తో నే ఓ సినిమా రావొచ్చేమో అని చమత్కరించాడు.