Shriya: దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ శ్రియా కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మార్చి 25న పాన్ ఇండియా రేంజ్‌లో వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ.600 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్రలలో నటించగా, అజయ్ దేవగణ్ కు జోడీగా సరోజిని పాత్రలో నటించిన శ్రియా ప్రేక్షకులను మెప్పించారు.
‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళితో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్‌కు భార్య పాత్రలో నటించిన శ్రియ, తెల్లదొరల తూటాలకు నేలకొరిగే సన్నివేశం అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేనంతగా శ్రియా పాత్ర ఈ సినిమాలో చాలా తక్కువగా ఉందని ఆమె అభిమానులు కాస్త అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్‌గా వైరల్ అవుతున్న ఈ కామెంట్స్‌పై స్వయంగా ఆమే స్పందించింది. రాజమౌళి డైరక్షన్‌లో తీస్తున్న సినిమాలో నటించమని చెప్పగానే తాను మరోమాట లేకుండా వెంటనే ఓకే చెప్పేశానని, అందులో తన పాత్ర ఏంటీ ? ఎంత నిడివి ఉంటుంది ? అనే విషయాలను అస్సలు పట్టించుకోలేదని ఆమె అన్నారు.
అంతే కాదు ఆ సినిమాలో తన పాత్ర చాలా చిన్నదని తానెప్పుడూ ఫీల్ కాలేదన్న శ్రియా, ఇంత గొప్ప మూవీలో తానూ ఒక భాగమైనందుకు గర్వంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాను ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూడలేదని , ఎందుకంటే థియేటర్లలో ఇంకా ఆ సినిమాకున్న క్రేజ్ తగ్గలేదని, అసలు తనకు సినిమా టికెట్లు కూడా దొరకటం కష్టంగా మారిందని ఆమె చెప్పారు. ఇక మొన్నటి వరకూ ఆలియా విషయంలోనూ ఇలా అసంతృప్తికి గురయ్యారంటూ వార్తలు రాగా, ప్రస్తుతం శ్రియాకు కూడా తన పాత్రపైన అసంతృప్తి ఉందని వార్తలు రావడంతో, ఆమె ఇలా సమాధానమిచ్చి, అందరికీ క్లారిటీ ఇచ్చింది.