నేనేం ఐటమ్‌ గర్ల్‌ను కాదు.. : తమన్నా

రజనీకాంత్‌ ‘జైలర్‌’లో ‘వా.. కావాలయ్యా.. దా.. దా..’ అంటూ ఐటమ్‌ నంబర్లో చెలరేగిపోయింది తమన్నా. ఆ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా.. ఆ పాట, అందులో తమన్నా నాట్యాభినయం కొన్ని నెలలపాటు సోషల్‌ మీడియాను కుదిపేశాయనే చెప్పాలి. రీసెంట్‌గా ‘స్త్రీ 2’లో కూడా ఓ చిన్న పాత్ర చేశారు తమన్నా. అందులో కూడా ‘ఆజ్‌ కీ రాత్‌..’ పాటలో సందడి చేశారు. ఆ సినిమా ఏకంగా 900కోట్ల క్లబ్‌లో చేరింది.

దాంతో ‘తమన్నా ఐటమ్‌ సాంగ్‌ చేస్తే సినిమా హిట్‌’ అనే సెంటిమెంట్‌ మొదలైంది. మామూలుగానే సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అందుకే.. దర్శక, నిర్మాతలంతా ఐటమ్‌ సాంగ్స్‌ చేయమంటూ తమన్నా ఇంటిముందు క్యూ కడుతున్నారట. దాంతో తమన్నా అసహనం వ్యక్తం చేశారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నేను చేసిన పాటలు ఆ సినిమాల సక్సెస్‌లకు హెల్ప్‌ అవ్వడం ఆనందంగానే ఉంది.

అందుకని, వరుసగా ఐటమ్‌ నంబర్లే చేయమంటే ఎలా? ‘జైలర్‌’ రజనీసార్‌ సినిమా అవ్వడంతో ఇష్టంతో చేశా. ‘స్త్రీ2’ డైరెక్టర్‌ అమర్‌ కౌశిక్‌ నాకు మంచి ఫ్రెండ్‌. తను అడగ్గానే కాదనలేక చేశా. అంతేతప్ప అదేపనిగా ఈ తరహా పాటలు చేయడానికి నేనేం ఐటమ్‌ గర్ల్‌ని కాదు..’ అంటూ అసహనం వ్యక్తం చేసింది తమన్నా భాటియా.