Ticket Prices: బాక్సాఫీస్.. ఈ సినిమాలకు కూడా టిక్కెట్ రేట్లు పెంచితే ఎలా?

తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ రోజు రోజుకు మరింత పెరుగుతోంది. బడ్జెట్ పరంగా, ప్రమోషన్ల పరంగా, టెక్నికల్‌గా సినిమాలు భారీ స్థాయికి చేరుతున్నాయి. దీంతోపాటే టికెట్ ధరలు కూడా రెగ్యులర్‌గా పెరుగుతున్నాయి. అయితే, ఇందులో కొంత అసహనం ఉన్నట్టు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. హై బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెరగడం అర్థం కాని విషయం కాదు. కానీ అదే సమయంలో చిన్న, మిడియం రేంజ్ సినిమాలకు కూడా అదే విధంగా రేట్లు పెరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

‘కల్కి’, ‘సలార్’, ‘పుష్ప 2’ వంటి సినిమాలకు బడ్జెట్ తగ్గట్లే టికెట్ ధరలు పెరిగాయి. ఇది అన్ని ఇండస్ట్రీలలో నడిచే ట్రెండ్. వీఐపి టెక్నాలజీ, భారీ స్కేల్, హై లెవెల్ విజువల్స్, భారీ స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాలు విడుదలకు ముందు కొన్ని రోజులు రేట్లు పెంచుకోవడాన్ని అభిమానులు పెద్దగా పట్టించుకోరు. కానీ తాజాగా ‘మాడ్ స్క్వేర్’, ‘రాబిన్ హుడ్’ వంటి సినిమాలకూ మొదటి వారం కోసం టికెట్ రేట్లు పెరగడంపై పెద్దగా నెగటివ్ టాక్ వస్తోంది.

ఇవి మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఉన్నా, ఈ స్థాయిలో రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? అన్నదానిపై సందేహాలే కాకుండా అసహనం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తికర విషయమేమిటంటే.. మలయాళంలో రానున్న ఎల్2ఈ.. సినిమా బడ్జెట్ పరంగా 300 కోట్లకు పైగానే ఉంటుందన్నది ట్రేడ్ బజ్. లూసిఫర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ, మోహన్‌లాల్, పృథ్విరాజ్ వంటి పెద్ద పేరు ఉన్నవాళ్లతో వస్తోంది.

విజువల్ ప్రెజెంటేషన్‌, కథా నేపథ్యం అంతా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందని ఇప్పటికే టీజర్ చూపించేసింది. అయినా ఈ సినిమాకు ఏ రాష్ట్రంలోనూ టికెట్ రేట్లు పెంచడం లేదు. టికెట్ ధరలు బడ్జెట్ బేస్‌గా కాకుండా ‘బజ్ బేస్’గా పెరుగుతున్నాయి. ప్రేక్షకుల ఆసక్తిని, హైప్‌ని క్యాష్ చేసుకునే తత్వమే ఇది. ‘బజ్ ఉంది కదా అని, రేట్లు పెడదాం’ అనే లాజిక్‌ని కొన్ని సినిమాల పిఆర్వో స్ట్రాటజీగా మార్చారు. నిజానికి టికెట్ ధర పెరగాలంటే దానికి ఒక బేస్ ఉండాలి.

అది కథా కంటెంట్‌, మేకింగ్ స్టాండర్డ్స్‌, లాంగ్ రన్‌కు పనికొచ్చే ఎమోషన్ ఉండాలి. కానీ ఇప్పుడు సినిమా పేరుకే, రెండు పాటల పాపులారిటీకి టికెట్ ధరలు పెంచేస్తున్నారు. దీన్ని చాలా మంది “తెలుగు ప్రేక్షకుల అభిమానం మీద ఓ కమర్షియల్ ప్రయోగం”గా చూస్తున్నారు. ఇలాంటి పరిణామాల్లో రానున్న రోజుల్లో ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు పెరిగిన టికెట్ రేటుతో థియేటర్లోకి వెళ్లి సినిమా పట్ల అసంతృప్తి ఎదురైతే, తర్వాత ఎలాంటి సినిమా వచ్చినా వాళ్లు వెనక్కి తగ్గే అవకాశం ఉంది.

ఈరోజు జరగబోయేది ఇదే! | RR vs KKR | Match Prediction | IPL 2025 Match - 6 | Telugu Rajyam