Honda X-ADV 750: మార్కెట్ లోకి అడ్వెంచర్ స్కూటర్.. ధర ఎంతంటే..

హోండా మోటార్సైకిల్స్ భారత మార్కెట్‌లోకి ఓ కొత్త సవాల్‌తో అడుగుపెట్టింది. ఇప్పటివరకు బైక్ లుక్‌లో వచ్చిన స్కూటర్లు ఉన్నా, నికరంగా అడ్వెంచర్ స్కూటర్ అనిపించే మోడల్ మాత్రం ఇదే తొలిసారి. హోండా తాజా విడుదల అయిన X-ADV 750 స్కూటర్ టూరింగ్ అభిమానులను ఆకట్టుకునేలా సిద్ధమైంది. దీని ప్రత్యేకతలు, ఫీచర్లు, ధరతో ప్రస్తుతం ఇది టూ వీలర్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

X-ADV 750 డిజైన్ పూర్తిగా అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను పోలి ఉంటుంది. పొడవాటి విండ్‌స్క్రీన్, బలమైన హెడ్‌లైట్లు, వెడల్పాటి హ్యాండిల్‌బార్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ వంటి అంశాలు దీని రూపాన్ని మరింత స్పోర్టీగా మార్చుతున్నాయి. కానీ అందులో స్కూటర్ సౌకర్యం కూడా ఉంటుంది. సీటు కింద 22 లీటర్ల స్టోరేజ్ ఇవ్వడం, రెగ్యులర్ డ్రైవింగ్‌కి కూడా ఇది ఉపయోగపడేలా చేయడం హైలైట్.

ఫీచర్ల విషయానికొస్తే, TFT డిస్‌ప్లే, బ్లూటూత్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS, నావిగేషన్ వంటి ఆధునిక సదుపాయాలతో నిండి ఉంది. రైడ్ మోడ్స్, హోండా టార్క్ కంట్రోల్, యూఎస్‌బీ సి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు దీన్ని ప్రీమియం కేటగిరీలో నిలిపాయి. ముందు 17 అంగుళాల, వెనుక 15 అంగుళాల టైర్లతో టఫ్ రోడ్‌లను కూడా సులువుగా తలదన్నగలదు.

ఇంజిన్ విషయానికొస్తే, 745సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 58 బీహెచ్‌పీ పవర్, 67 ఎన్ఎమ్ టార్క్‌తో ఇది నిజంగా పవర్ హౌస్ లాంటి స్కూటర్. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే దీని ధర మాత్రం సామాన్య వినియోగదారుల నోటి వెంట పాలు పోసే ధర కాదని చెప్పాలి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.90 లక్షలు. విలాసవంతమైన స్కూటర్ల కోసం చూస్తున్నవారికి ఇది ఓ ప్రత్యేక ఆప్షన్ కావొచ్చు.