Trisha Krishnan: తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో రెండున్నర దశాబ్దాలుగా ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన త్రిష, ఇప్పుడు కెరీర్‌లో మరొక రేంజ్ లో కొనసాగుతుండడం విశేషం. ‘నీ మనసు నాకు తెలుసు’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష, అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా త్రిష క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.
తాజాగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష కెరీర్ మరింత ఊపందుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు వచ్చిన ప్రశంసలు ఆమెను మళ్లీ స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులలో చేర్చాయి. విజయ్ సరసన నటించిన లియో చిత్ర విజయంతో త్రిష మరోసారి టాప్ హీరోయిన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా ఏడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి, వీటిలో కొన్ని ఇప్పటికే విడుదలకు సిద్ధమయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవితో చేసిన విశ్వంభర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అజిత్‌తో విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి చిత్రాలు ఆమెను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కమల్ హాసన్‌తో థగ్ లైఫ్, మోహన్ లాల్‌తో మలయాళ సినిమా రామ్, సూర్య 45లో ఆమె పాత్రలు హైలైట్ కానున్నాయి. ఈ ప్రాజెక్టులలో త్రిష తన ప్రతిభను మరోసారి నిరూపించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు మాత్రమే కాకుండా త్రిష మలయాళంలో ఐడెంటిటీ అనే థ్రిల్లర్ మూవీ కూడా పూర్తి చేశారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయితే, ఆమె హవా మరింతగా పెరగడం ఖాయం. ప్రస్తుతం త్రిష ఒక్క సినిమాకు రూ. కోటి వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. గతంలో తనతో కలసి కెరీర్ ప్రారంభించిన చాలా మంది హీరోయిన్లు సపోర్టింగ్ రోల్స్‌కి పరిమితం కాగా, త్రిష మాత్రం లీడ్ రోల్స్‌లో మెరవడం విశేషం.