టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రంభ మరోసారి సినీ ప్రపంచంలోకి అడుగుపెడతుందా? ఈ ప్రశ్న ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 90ల నుంచి 2000ల వరకు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన రంభ, 2010లో వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కానీ, ఇప్పుడామె వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
లేటెస్ట్ గా ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ వార్తలకు మరింత ఊతమిచ్చారు. రంభ భర్త ఇటీవల తనను కలసి, ఆమెకు సినిమా అవకాశాలు కల్పించాలనుకుంటున్నట్లు చెప్పారని థాను వెల్లడించారు. ప్రస్తుతం కుటుంబ జీవితంలో స్థిరపడిన రంభ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందని, తన బ్యానర్‌లో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ఆమెను తీసుకుంటానని థాను స్పష్టంచేశారు. అయితే, ఇప్పటివరకు ఆమె రీఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇప్పటికే బుల్లితెరపై జడ్జిగా రంభ కనిపిస్తోంది. తమిళ స్టార్ విజయ్ టీవీలో జోడీ ఆర్ యూ రెడీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. కానీ వెండితెరపై ఆమె మళ్లీ కనిపిస్తే, అభిమానులకు పెద్ద కానుక అనే చెప్పాలి. గతంలో సౌత్ ఇండస్ట్రీలో అన్ని పెద్ద హీరోల సరసన నటించిన రంభ, అప్పట్లో యూత్ ఐకాన్‌గా పేరొందింది. ముఖ్యంగా ఆమె ఎనర్జిటిక్ డాన్స్ నంబర్స్, గ్రేస్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది.
ఇప్పుడు రంభ రీ-ఎంట్రీ నిజమేనా అంటే సన్నిహిత వర్గాలు మాత్రం ‘ఊహాగానాలే’ అంటున్నాయి. కానీ నిర్మాతలు, సినీ వర్గాలు ఆమె మళ్లీ వెండితెరపై కనిపిస్తే ఖచ్చితంగా ఓ ప్రత్యేకమైన పాత్రలోనే తిరిగి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్లకు మరింత ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో, రంభ రీ-ఎంట్రీపై ఆసక్తి పెరగడం సహజమే. మరి, ఆమె నిజంగా మళ్లీ వెండితెరపై మెరుస్తుందా లేక మరికొంత సమయం పట్టొచ్చా అనేది చూడాలి.


