షాడో ఇమేజ్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రాయండి… విమర్శకులకు హరీష్‌ శంకర్‌ సవాల్‌!

షాడో ఇమేజ్‌ పెట్టి కాదు.. దమ్ముంటే నా ఫొటో వేసి.. నిర్మాత ఇంట్లో మద్యం తాగాడని రాయ్‌.. అంటూ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ఫైర్ అయ్యారు. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్‌ శంకర్‌ అతిథిగా హాజరయ్యారు.

‘ఈగల్‌’ సినిమాపై వస్తున్న ట్రోలింగ్‌ గురించి మాట్లాడుతూ.. తనపై లేనిపోని వార్తలు రాస్తున్న వారిపై ఆయన ఫైర్‌ అయ్యారు. మేము ఏ పొలిటికల్‌ అజెండా లేకుండా సినిమాలు తీయాలి. సినిమా అంటే ఒకటి కళాత్మకం.. రెండోది వ్యాపారం. నా సినిమా అన్ని పార్టీల వాళ్లు చూడాలని కోరుకుంటా. ఒక వర్గాన్ని దూరం చేసుకోవాలనే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది. పవన్‌ కళ్యాణ్‌ గారు కూడా నా గురించి చెప్పారు. మీరు సినిమా డైరెక్టర్‌. జనసేనకు సంబంధించి కానీ, వేరే ఇతరత్రా విషయాలలో కానీ మీరు రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం లేదు’ అని స్టిక్ట్‌గ్రా చెప్పారు.

మేము ఏ సినిమా చేస్తున్నా.. హౌస్‌ఫుల్‌ అవ్వాలని అనుకుంటాం. మాకు ఎటువంటి అజెండాలు ఉండవు. కార్తిక్‌ రెండో సినిమా చేసుకుంటున్నాడు. మేము ఉన్నాం కదా.. మా మీద సెటైర్లు వేసుకోండి. మేము రెడీ. అతనిపై సెటైర్లు ఆపండి. ఒక చిన్న లైన్‌ మిస్‌ అవుతున్నాం. క్రిటిసిజమ్‌కి, ట్రోలింగ్‌కు తేడా తెలియకుండా పోతుంది. విమర్శ వేరు.. ఎద్దేవా, ఎగతాళి వేరు. ఎవరో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారంటే అర్థం ఉంది.

మన రివ్యూస్‌ కూడా ట్రోల్‌ చేసే విధంగా ఉన్నందుకు బాధేస్తుంది. నాలుగు సంవత్సరాల నుండి సినిమా లేదు.. నిర్మాత ఇంట్లో కూర్చుని తెల్లవార్లు మద్యం తాగాడు ఓ డైరెక్టర్‌.. ఇతను పవన్‌ కళ్యాణ్‌తో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు అంటే.. ఇంకెవరు? మొత్తం రాసే ధైర్యం ఉండదు.. ఒక షాడో ఇమేజ్‌ పెడతారు. రా.. దమ్ముంటే నా ఫొటో వేసి.. హరీష్‌ శంకర్‌ తెల్లవార్లు తాగాడు అని రాయ్‌. నీ కౌంటర్‌కి నేను కౌంటర్‌ వేస్తాను. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాటకు ముందు గ్యాప్‌ వచ్చింది అంటుంటాడు. నేనిప్పుడు రెండు సినిమాలు చేస్తున్నా. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’. అతి త్వరలో పెద్ద హీరోలతో మరో రెండు సినిమాలు ప్రకటించబోతున్నా. ఇదేమన్నా ప్రొగ్రెస్‌ రిపోర్టా? మా నాన్నలాగా ఫీజ్‌ కట్టావా.. నేను ఏం చేస్తున్నానో నీకు చూపించడానికి?. నాలుగు కాకపోతే ఐదేళ్లు కుదరదు. నీకు ప్రాబ్లమ్‌ ఏంటి? నీ ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతున్నానా? నా రెంట్‌ కట్టండని. ట్రోలింగ్‌ మాకేం కొత్తకాదు.

మేము సినిమా రంగంలోకి అడుగుపెట్టేటప్పుడే.. మా అమ్మనాన్నలే మాపై మొదట ట్రోల్‌ చేశారు. సినిమా పుట్టాకే వెబ్‌సైట్స్‌ పుట్టాయ్‌. వెబ్‌సైట్స్‌ పుట్టాక సినిమా పుట్టలేదు. అన్నిటికి తెగించి.. ఎన్నో సౌకర్యాలు, సుఖాలు త్యజించి ఇక్కడకొచ్చి నిలబడ్డాం. అందరినీ అనడం లేదు. మళ్లీ అందరూ భుజాలు తడుముకోకండి. అని హరీష్‌ శంకర్‌ సీరియస్‌ అయ్యారు.