జోరు తగ్గని ‘హనుమాన్‌’ కలెక్షన్లు!

సంక్రాంతి బరిలో వచ్చిన ‘హనుమాన్‌’ సినిమా కలెక్షన్లలో ఇంకా జోరు తగ్గించలేదు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు వారాలు గడుస్తోన్న సినిమాకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై 25 రోజుల్లో రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ సినిమా కలెక్షన్ల జోరు తగ్గలేదు.

ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘హనుమాన్‌’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌ అనే మాటా చాలా చిన్నది అవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ కుటుంబ సమేతంగా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. సినిమాను మనసులో పెట్టుకున్నారు.

ఇంత విజయాన్ని మాకు అందించిన గ్లోబల్‌ వైడ్‌ ప్రేక్షకులు అందరికీ మా టీమ్‌ రుణపడి ఉంటుంది’ అని ప్రశాంత్‌ వర్మ పేర్కొన్నారు.’హనుమాన్‌’ చిత్రాన్ని వీక్షించిన సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే! తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత.