రాజకీయ నాయకులు అందునా పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నవారు ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలగకూడదనే రీతిలోనే ఉంటాయి వారి వ్యూహాలు. అందుకోసం వారు పార్రీలు మారుతుంటారు. ఒకే కుటుంబం నుండి ఒకరు ఒక పార్టీలో ఉంటే ఇంకొకరు ఇంకో పార్టీలో చక్రం తిప్పుతుంటారు. అలా అటు రాజకీయంగా ఇటు వ్యాపారం పరంగా సేఫ్ జోన్లోనే ఉంటారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న గల్లా అరుణకుమారి ఇప్పుడు అదే ఫార్ములా అవలంభించబోతున్నారని టాక్. మొదటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె తర్వాత టీడీపీలో చేరారు. 2019 వరకు పార్టీలో చురుగ్గానే ఉంటూ వచ్చిన ఆమె ఇటీవల తన పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారనున్నారనే టాక్ మొదలైంది. ఆమె అడుగులు బీజేపీ వైపు పడుతున్నట్టు చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ రాష్ట్రంలో బలంగా లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంది. వారి అండ ఉంటే తమకు అన్ని విధాలా మంచిదని భావించే ఆమె పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వారి కుటుంబానికి చెందిన అమరరాజ గ్రూప్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని అనుకోవడం, ఆ విషయమై గళ్ళ జయదేవ్ కోర్టును ఆశ్రయించడం జరిగాయి. ఇడుప్పటికే టీడీపీలోని కొందరు బిగ్ షాట్స్ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ఫలితంగా వారి వ్యాపార మూలాలు కదులుతున్నాయి.
అందుకే గల్లా కుటుంబం ఒక పెద్ద అండ కోసం బీజేపీ వైపు అడుగులు వేస్తోందని, అరుణకుమారి బీజేపీలో చేరితే వారి మీద ఈగ వాలదని చెప్పుకుంటున్నారు. ఇక అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అందుకే కుమారుడిని అక్కడే ఉంచి తాను మాత్రం బీజేపీలోకి వెళ్లాలని అరుణకుమారి భావిస్తున్నారట. అప్పుడు రాజకీయంగా, వ్యాపారాల పరంగా భద్రంగా ఉండొచ్చనేది గళ్ళ ఫ్యామిలీ ప్లానట. ఆంతేకాదు అరుణకుమారి లాంటి క్యాడర్ ఉన్న లీడర్ బీజేపీలో చేరితే ఆమెకు దక్కే ప్రాధాన్యం కూడ ఎక్కువగానే ఉంటుంది. చిత్తూరు జిల్లా పరంగా బీజేపీ వ్యవహారాలన్నీ ఆవిడ కనుసన్నల్లోనే నడిచే అవకాశం ఉంది.