100 ఏళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో టాలీవుడ్ కి 89 ఏళ్లు.. అందులో 50 ఏళ్ల చ‌రిత్ర క్రిటిక్స్ కి ఉందా?

100 ఏళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో టాలీవుడ్ కి 89 ఏళ్లు.. అందులో 50 ఏళ్ల చ‌రిత్ర క్రిటిక్స్ కి ఉంద‌ట‌! ప్ర‌స్తుతం 77 మంది ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ లో స‌భ్య‌త్వం క‌లిగి ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా.. వెబ్ మీడియాతో సంబంధం లేకుండా కేవ‌లం ప్రింట్ జ‌ర్న‌లిస్టులు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు ఈ అసోసియేష‌న్ లో కొన‌సాగున్నారు.

film critics association 50 years history
film critics association 50 years history

టాలీవుడ్ వ‌జ్రోత్స‌వాల గురించి .. భార‌తీయ సినిమా వందేళ్ల ఉత్స‌వాల గురించి తెలిసిందే. మునుముందు టాలీవుడ్ 100 ఏళ్ల సెల‌బ్రేష‌న్స్ చేసుకునే వీలుంది. అప్ప‌టికి ఫిలింక్రిటిక్స్ చ‌రిత్ర 60 ఏళ్లు పూర్త‌వుతుంది. ఇక ఇన్నాళ్ల‌కు టాలీవుడ్ ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ త‌మ స‌భ్యులంద‌రికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల్ని అంద‌జేసింది. ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షులు ఎన్.శంక‌ర్ చేతుల‌మీదుగా క్రిటిక్స్ ఈ హెల్త్ కార్డుల్ని అందుకున్నారు. అలాగే సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ) మూడో విడ‌త స‌రుకుల్ని క్రిటిక్స్ స‌భ్యుల‌కు పంపిణీ చేసారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షుడు ఎన్.శంక‌ర్.. ఫిలింక్రిటిక్స్ అధ్య‌క్షుడు సురేష్ కొండేటి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఇ.జ‌నార్థ‌న్ రెడ్డి, ఉపాధ్య‌క్షురాలు డి.జి.భ‌వానీ, జాయింట్ సెక్ర‌ట‌రీ మ‌డూరి మ‌ధు, ఈసీ మెంబ‌ర్ ముర‌ళి,  సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎన్.శంక‌ర్ మాట్లాడుతూ-“88 ఏళ్ల టాలీవుడ్ హిస్ట‌రీలో 50 ఏళ్లు పైగా ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ యాక్టివ్ గా కొన‌సాగుతోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా దాదాపు 77 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల్ని అంద‌జేయ‌డం ఇదే తొలిసారి. క్రిటిక్స్ అధ్య‌క్షుడు సురేష్ కొండేటి.. ఇత‌ర కార్య‌వ‌ర్గాన్ని అభినందిస్తున్నాను. ఇటీవ‌ల క్రైసిస్ క‌ష్ట కాలంలోనూ జ‌ర్న‌లిస్టులు ప‌రిశ్ర‌మకు అండ‌గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి సేవా మార్గంలో సీసీసీ స‌రుకుల పంపిణీ మూడో ద‌ఫా కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా సాగుతోంది. ప్ర‌తిసారీ క్రిటిక్స్ త‌మ‌వంతుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు“ అని తెలిపారు.

ఫిలిం క్రిటిక్స్ అధ్య‌క్షుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ-“మెగాస్టార్ చిరంజీవి గారు ప్రారంభించిన సీసీసీ కార్య‌క్ర‌మంలోనూ క్రిటిక్స్ పాలు పంచుకోవ‌డం ఆనందంగా ఉంది. సినీకార్మికుల‌కు మూడోద‌ఫా స‌రుకుల్ని అంద‌జేస్తున్నాం. క్రిటిక్స్ కి స‌రుకుల పంపిణీ విజ‌య‌వంతంగా సాగింది. అలాగే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల తో క్రిటిక్స్ రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కూ భీమా స‌దుపాయం పొంద‌డం ఇలాంటి క‌ష్ట‌కాలంలో సంతోషం క‌లిగించే విష‌య‌మే. అలాగే ఈ రంగంలో నేను ఎన్నో చిత్రాల్ని పంపిణీ చేసాను. వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తూ సంతోషం మ్యాగ‌జైన్ ప‌బ్లిష‌ర్ గా ఒక జ‌ర్న‌లిస్టుగా.. సినీ జ‌ర్న‌లిస్టుల కార్య‌క్ర‌మాల్లో భాగం అయినంద‌కు ఆనందంగా ఉంది“ అని తెలిపారు.

ఫిలింక్రిటిక్స్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఇ.జ‌నార్థ‌న్ రెడ్డి మాట్లాడుతూ-“50 సంవ‌త్స‌రాల క్రిటిక్స్ అసోసియేష‌న్ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా సేవాకార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. క్రైసిస్ వేళ మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సేవాకార్య‌క్ర‌మాల‌కు క్రిటిక్స్ త‌ర‌పున అన్నిర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నాం. క్రిటిక్స్ కి మూడో ద‌ఫా స‌రుకుల పంపిణీ కార్యక్ర‌మం చేశాం. అలాగే సంఘంలోని స‌భ్యులంద‌రికీ హెల్త్ కార్డుల్ని అంద‌జేశాం. ఎన్. శంక‌ర్ చేతుల‌మీదుగా వీటిని పంపిణీ చేసినందుకు ఆనందంగా ఉంది“ అన్నారు.

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు మాట్లాడుతూ.. ప‌రిశ్ర‌మ‌లో ఎన్న‌డూ లేనంత‌గా ఇటీవ‌ల క్రిటిక్స్ యాక్టివ్ గా ఉంటూ సేవాకార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. తొలిసారి ఇన్సూరెన్సులు ఇచ్చి భ‌రోసా క‌ల్పించ‌డం సంతోషంగా ఉంది. క్రిటిక్స్ సేవా కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టికీ కొన‌సాగుతాయి.. అని అన్నారు.