ఎన్టీఆర్ వ్యవహార శైలి పై మండిపడుతున్న టీడీపీ ఫ్యాన్స్ !

Young Tiger NTR

ఆంధ్రప్రదేశ్ లో నిత్యం ప్రతిపక్షాలు పాలకపక్షాల మధ్య ఏదో ఒక రగడ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు పేరు తొలగించి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. ఈ వివాదంతో ప్రతిపక్ష నాయకులు అధికారపక్షం మీద మండిపడుతూ నిరసనలు చేస్తున్నారు. ఇక మరొకవైపు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు ఇప్పుడు రచ్చ గా మారింది. ఈ వివాదం గురించి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ కూడా విశేష ప్రేక్షకాదరణ పొందిన నాయకులు. ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల వైయస్సార్ ఖ్యాతి పెరగదు… అలాగే ఎన్టీఆర్ మీద జనాలకు ఉన్న అభిమానం తగ్గదు అంటూ చాలా సమయస్ఫూర్తిగా స్పందించాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇలా సేఫ్ గేమ్ ఆడటంతో అతని అభిమానులు సైతం తన మీద విమర్శలు చేస్తున్నారు.

ఇక ఈ విషయం గురించి కళ్యాణ్ రామ్ కూడా స్పందిస్తూ.. విద్యార్థులకు వైద్య విద్య అందించటం కోసం ఎన్టీఆర్ చేసిన కృషికి గుర్తుగా ఆ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా 25 ఏళ్లుగా ఎన్టీఆర్ పేరును మార్చలేదు. కానీ ఇప్పుడు ఆ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరును తొలగించడం చాలా బాధాకరంగా ఉంది. రాజకీయాల కోసం కొన్ని ఏళ్లుగా భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాన్ని చాలా తప్పు అంటూ కళ్యాణ్ రామ్ సూటిగా స్పందించాడు. ఇలా కళ్యాణ్ రామ్ సూటిగా స్పందించటంతో ఎన్టీఆర్ అభిమానులు కళ్యాణ్ రామ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.