తొలుత సమంతను వద్దనుకున్నా.. ‘రంగస్థలం’పై దర్శకుడు సుకుమార్‌

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’ ఈ సినిమా టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది. చిట్టిబాబుగా రామ్‌ చరణ్‌, రామలక్ష్మిగా సమంత ఇద్దరూ వారి పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అయితే, ఈ చిత్రంలో మొదట సమంతను వద్దనుకున్నారట సుకుమార్‌. ఎందుకు వద్దనుకున్నారో అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఆ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు.

‘రంగస్థలం’లో చరణ్‌ అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలో అతడిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఈ విషయం తనతోనూ చాలాసార్లు చెప్పాను. మొదట ఈ చిత్రంలో సమంతను తీసుకోవాలనుకోలేదు. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందనుకున్నా. సినిమాలో హీరో, హీరోయిన్‌ ఇద్దరూ పెద్ద స్టార్స్‌ అయితే నేను సెట్‌లో మేనేజ్‌ చేయలేనేమో అనిపించింది. అందుకే రామ్‌ చరణ్‌ ఒక్కరు చాలు హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని తీసుకుందాం అనుకున్నా. కానీ, సినిమా స్క్రిప్ట్‌ ప్రకారం మంచి ఆర్టిస్టు, తెలుగు వచ్చిన హీరోయిన్‌ కావాలి. సమంత అయితే ప్లలెటూరి అమ్మాయి పాత్రకు సరిపోతుందని ఆమెను ఎంపిక చేశాను.

షూటింగ్‌ సమయంలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. ప్రతీ సన్నివేశంలో ఆమె పలికించిన హావభావాలు అద్భుతం. అంత బాగా చేసింది. ఆ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలోనూ నేను ఒక్కటే చెప్పా.. నేను సినిమాలు తీసినంతకాలం సమంతను తీసుకుంటూనే ఉంటానన్నా. 30 ఏళ్లు వస్తే ఆ వయసుకు తగ్గపాత్ర.. 40 వస్తే ఆ ఏజ్‌కు సరిపోయే పాత్ర.. ఇలా ఆమెకు ఎప్పుడూ అవకాశమివ్వాలని అనుకున్నాను.

ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సీన్‌ కూడా కథకు అవసరం కాబట్టే పెట్టాం. సినిమాను కళాత్మక దృష్టితో చూడాలి. మరోలా చూడడం పద్ధతి కాదు. సందర్భం వచ్చినప్పుడు ఒక అమ్మాయి.. అబ్బాయి చేయిపట్టుకోవడం ఎంత ముఖ్యమో.. ముద్దు పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్పారు. 2018 మార్చి 30న ‘రంగస్థలం’ విడుదలైంది. ఇందులో నటించిన అందరికీ ఈ చిత్రం మైలురాయిగా నిలిచింది.