‘కల్కి’ కల నెరవేరడానికి చాలా సమయమే పట్టింది.. ట్రైలర్‌కు ఆదరణతో డైరెక్టర్‌ ఆశ్విన్‌ ఆనందం!

‘కల్కి’ కల నెరవేరడానికి చాలా సమయమే పట్టిందన్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ .ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. జూన్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకొని లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్ లో ఉంది.

దీనిపై దర్శకుడు మాట్లాడుతూ.. ఎమోషనల్‌గా ఉందన్నారు. ‘ఈ ట్రైలర్‌ రిలీజ్‌ అయిన సందర్భంగా నా మనసు భావోద్వేగానికి గురవుతుంది. పురాణాలు, సైన్స్‌ రెండింటిపై నాకు ఆసక్తి ఎక్కువ. ఈ రెండింటిని కలిపి సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల క్రితం అనుకున్నాను. మా ఆర్టిస్టులందరి సాయంతో మైథాలజీకి సైన్స్‌ను జోడించి ‘కల్కి 2898 ఏడీ’ తెరకెక్కించాను. టీమ్‌ అద్భుతమైన ప్రతిభ, అంకిత భావం వల్లే ఇది సాధ్యమైంది. నా కలని సాకారం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. చిత్రబృందమంతా ఎంతో కష్టపడి పని చేసింది. తెలుగు ప్రేక్షకులతో పాటు. దేశంలోని వారంతా దీన్ని చూసి గర్వపడతారు’ అని నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.

తాజాగా విడుదలైన ‘కల్కి’ ట్రైలర్‌ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హిందీ భాషలో 24 గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ నేపథ్యంలో సోషల్‌ విూడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. త్వరలోనే ట్రైలర్‌2ను విడుదల చేయనున్నారని జోరుగా ప్రచారమవుతోంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో రెండు ట్రైలర్లు కట్‌ చేశారని.. త్వరలోనే రెండో దాన్ని రిలీజ్‌ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే మరో వారంలో ఫస్ట్‌ సింగిల్‌ కూడా రానున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇందులో పలు భాషలకు చెందిన అగ్ర నటీనటులు భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ , కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.