బాహుబలి సినిమా తెలుగు సినిమాని దేశ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ఈ మూవీతోనే ప్రభాస్, రానాలు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. బాహుబలి రెండు భాగాలుగా చిత్రీకరించారు. అయితే, ఈ సినిమా విషయంలో రానా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి.
బాహుబలి రెండు భాగాల కోసం రాజమౌళి రూ.400కోట్లు అప్పు తీసుకున్నాడంటూ రానా షాకింగ్ కామెంట్స్ చేశాడు.ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుంచి రాజమౌళి ఇంత పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారని రానా చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో రానా ఈ విషయాలు చెప్పడం గమనార్హం.
‘సినిమా చేయడం కోసం నిర్మాతలు అధిక వడ్డీలకు అప్పులు తెస్తారు. నాలుగేళ్ళ క్రితం పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే రెండే ఆప్షన్స్ ఉండేవి. ఒకటి ఆస్తులను తాకట్టు పెట్టాలి, లేదా ఎక్కువ రేట్ కు అప్పులు తీసుకోవాలి. బాహుబలి సినిమా కోసం మేము దాదాపు రూ. 400 కోట్ల అప్పు తీసుకున్నాం అన్నారు. అలాగే ఇందుకోసం 24- నుండి 28 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. నిజానికి ఇది చాలా ఎక్కువ. ఆ సమయంలో నిర్మాతలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బాహుబలి సినిమా వర్క్ అవుట్ అయ్యింది కాబట్టి ఆ డబ్బు తిరిగి చెల్లించగలిగాం. ఒకవేళ ఫెయిల్ అయ్యుంటే ఎలా అనేది ఊహించుకోవడానికే భయంగా ఉంది’ అంటూ రానా చెప్పారు. నిజంగానే రాజమౌళి డబ్బులు అప్పుతెచ్చాడా అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే, ఇది అబద్ధం అని స్పష్టంగా తెలుస్తోంది.
నిజానికి బాహుబలి మొదటి విడత బడ్జెట్ రూ.150 కోట్లు. ఇది అప్పటి తెలుగు సినిమా మార్కెట్ కంటే నిజంగానే చాలా ఎక్కు. కాగా, ఈ సినిమా కోసం రాజమౌళి రామోజీ రావు ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం. వారి స్టూడియో సౌకర్యాలనే రాజమౌళి ఎక్కువగా ఉపయోగించారు. మొదటి విడత భారీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. దీంతో, టీమ్ మాట్రిక్స్ ప్రసాద్ నుండి రెండో పార్ట్ కోసం తక్కువ వడ్డీకి డబ్బు తీసుకున్నారు.
బాహుబలి రెండు భాగాలకు మొత్తం కలిపి దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ అయ్యింది.కానీ రాజమౌళి ఏకంగా రూ.400కోట్లు అప్పుగా తీసుకువచ్చాడు అని రానా చెప్పడం గమనార్హం. ఇలాంటి అబద్దం రానా ఎలా చెప్పాడు అని ఓవైపు అందరూ ఆశ్చర్యపోతుంటే, ఈ కథలను బాలీవుడ్ మీడియా నిజమని నమ్మి ప్రచారం చేస్తుండటం విశేషం.