ప్రస్తుత రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రతి ఇంట్లోనూ ఒకరు.. మధుమేహంతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపం, ఒత్తిడితో మధుమేహం (డయాబెటిస్) అన్నది చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచం మొత్తానికి ఇది పెద్ద ఆరోగ్య సవాలుగా మారింది. మధుమేహం ఉన్నవారి శరీరం ఇన్సులిన్‌ను సరైన విధంగా ఉపయోగించలేకపోతుంది. ఈ ఇన్సులిన్ లోపంతో గ్లూకోజ్ కణాల్లోకి చేరకపోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారికి గుండె, కిడ్నీ, నేత్రాలు, నరాల సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఇది ప్రమాదకరం అయినా, దాని ప్రారంభ లక్షణాలు చాలా మందిలో గుర్తించకుండా పోతాయి. ఆరోగ్యం బాగోలేదు అనిపించినప్పుడు పరీక్షలు చేయించుకుంటే మధుమేహం ఉందని తేలుతుంది. ఇదే పరిస్థితిని నివారించాలంటే, కొన్ని ముఖ్యమైన సంకేతాలను ముందే గుర్తించ వచ్చు. ఉదాహరణకు తరచుగా దాహం వేయడం, నోరు పొడిబారడం, అసహజమైన ఆకలి, తరచుగా మలమూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ముందే అలర్ట్ కావాలి. అదేవిధంగా, బరువు అకారణంగా తగ్గడం లేదా వేగంగా పెరగడం కూడా ప్రమాద సంకేతాలే.
మరికొన్ని సమస్యలు కొద్దిగా ఆలస్యంగా బయటపడతాయి.. తలనొప్పి, కళ్లు మసకగా కనిపించడం.. అధిక అలసట, మధుమేహం ఉన్నవారిలో గాయాలు త్వరగా మానకపోవడం, చర్మం పొడిబారడం, వాపులు రావడం, పాదాల వద్ద దురద వంటి సమస్యలు కనిపించవచ్చు. మహిళల్లో మధుమేహం వల్ల జననాంగాల వద్ద అధిక పొడిబారడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు ఉండొచ్చు.
పురుషుల విషయంలో, 35 నుంచి 70 శాతం మందికి అంగస్తంభన సమస్యలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గే అవకాశమూ ఉంది. ఈ లక్షణాలను చిన్నవి అనుకుని పట్టించుకోకుండా వదిలేయకండి. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి మార్పులు కనిపిస్తే, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మధుమేహం అంటే జీవితాంతం ఉండే వ్యాధి కాదు దీనిని నియంత్రించడమూ, ఆరోగ్యంగా జీవించడమూ మన చేతిలోనే ఉంది.