అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ‘దేవర’ సినిమా ఏప్రిల్‌లోనే విడుదలవ్వాల్సి వుంది.! కానీ, పెద్ద సినిమా.. పైగా, పాన్ ఇండియా రేంజ్.. దాంతో, ఆ ‘పాన్’ కష్టాలు తప్పట్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా ప్రారంభమైన ‘దేవర’, ఏప్రిల్ నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
ఏప్రిల్‌లో సినిమా విడుదల కావడంలేదన్న విషయమ్మీద స్పష్టత అయితే వచ్చిందిగానీ, తదుపరి రిలీజ్ డేట్ విషయమై చిత్ర యూనిట్ స్పందించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, గాయపడ్డంతోనే ఈ వాయిదా.. అన్న విషయమొక్కటే బయటకు పొక్కింది. కానీ, అసలు కథ వేరే వుంది. సినిమాకి రీ-షూట్స్ అవసరం పడ్డాయన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
వీఎఫ్ఎక్స్ సమస్యల సంగతి సరే సరి. రెండు నెలలో, మూడు నెలలో సరిపోదు.. చాలా సమయం పడుతుందట. రీ-షూట్ అంటే కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లే. దసరా కానుకగా.. అన్న ప్రచారం జరుగుతోందిగానీ, అదీ నిజం కాదు.
సంక్రాంతి సీజన్ బెటర్ అనుకుంటున్నారుగానీ, ఆల్రెడీ 2025 సంక్రాంతి మీద చాలా కర్చీఫ్‌లు వున్నాయ్. ఎలా చూసినా, ఈ ఏడాది ‘దేవర’ విడుదల కాకపోవచ్చు. లాబీయింగ్ ఏమైనా వర్కవుట్ అయితే, 2025 సంక్రాంతికి ‘దేవర’ రావొచ్చంటున్నారు. ఆ దిశగా లాబీయింగ్ అప్పుడే షురూ అయ్యిందట కూడా.