‘కల్కి 2898’ ఏడీ’తో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతున్నారు నటి దీపికా పదుకొణె. కొన్నాళ్ల క్రితమే ఆమె టాలీవుడ్‌లో నటించారు గానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. మోడల్‌గా రాణించే సమయంలోనే ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించడంతోపాటు పలు ‘ఫ్యాషన్ వీక్స్’లో పాల్గొనేవారు. బికినీ ధరించి, కింగ్ ఫిషర్ క్యాలండర్‌కు పోజులివ్వడం అప్పట్లో హాట్ టాపిక్. సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియాతో కలిసి నటించిన ‘నామ్ హై తేరా’ మ్యూజిక్ వీడియో శ్రోతల్ని విశేషంగా అలరించింది. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’ (2006)తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. అది తెలుగు హిట్ మూవీ ‘మన్మథుడు’కు రీమేక్‌గా రూపొందింది. ఇక్కడ సోనాలీ బింద్రే పోషించిన పాత్రలో అక్కడ దీపిక నటించారు. దీపిక తొలి బాలీవుడ్ సినిమా ‘ఓం శాంతి ఓం’ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. షారుక్ ఖాన్-దీపికలను ‘సూపర్ హిట్ జోడీ’ అని పిలవడం ఆ చిత్రంతోనే ఆరంభమైంది.
చిత్ర పరిశ్రమ ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ మూవీలో ఈ ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. ‘హీరోయిన్’ పాత్రలో ఒదిగిపోయేందుకు దీపిక పడిన శ్రమ వృథా పోలేదు. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత, ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’ సైతం మంచి విజయాల్ని అందుకున్నాయి.
‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ వంటి హిస్టారికల్ మూవీస్ ఆమెను బాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిపాయి. యాసిడ్ దాడి బాధితురాలిగా నటించిన ‘ఛపాక్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుక్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇలా అగ్ర నటుల సరసన నటించినా.. కథ నచ్చితే యంగ్ హీరోలతో ఆడిపాడేందుకూ ముందుంటానని ’చెప్పకనే చెప్పారు. ‘ధమ్ మారో ధమ్’, ‘బాంబే టాకీస్’లాంటి సినిమాల్లోని ప్రత్యేక గీతాలతోనూ ఉర్రూతలూగించారు. ఆంగ్ల చిత్రాలు ’త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇన్నేళ్ల తర్వాత ‘కల్కి’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీతో అలరించ బోతున్నారు.