దీపికా మేనేజ‌ర్ ఇంట్లో సోదాలు.. ఎన్సీబీకి దొరిక‌న మాద‌క ద్రవ్యాలు..ప‌రారీలో కరిష్మా

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచార‌ణ‌లో ప‌లువురు సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌ట‌కు వచ్చాయి. దీంతో ఎన్సీబీ..స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే – సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ – శ్రద్ధా కపూర్ లకు నోటీసులు జారీ చేసి విచార‌ణ‌కు పిలిపించారు,

విచార‌ణ‌లో భాగంగా హీరోయిన్స్ నుండి ప‌లు కీల‌క అంశాలు రాబ‌ట్టిన ఎన్సీబీ వారి స్టేట్‌మెంట్స్ ని రికార్డ్ చేసింది. త్వ‌ర‌లో మ‌రోసారి వారిని విచార‌ణ‌కు పిల‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే డ్ర‌గ్స్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడితో పాటు ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్, అర్జున్ రామ్ పాల్ గర్ల్ ఫ్రెండ్ ‘ఊపిరి’ ఫేమ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడు కూడా అరెస్ట్ అయ్యారు. తాజా స‌మాచారం ప్ర‌కారం దీపిక ప‌దుకొణే మేనేజ‌ర్ క‌రిష్మా ప్ర‌కాశ్‌ని కూడా అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది.

రీసెంట్‌గా ఎన్సీబీ అధికారులు ముంబై వెర్సోవాలోని కరిష్మా ఇంట్లో జ‌రిపిన సోదాల‌లో 1.7 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు మరియు రెండు సీసాల సీబీడీ ఆయిల్ లభించినట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే వెల్లడించారు. అయితే ఇప్ప‌టికే ఎన్సీబీ అధికారులు ఆమెకు నోటీసులు పంపినప్ప‌టికీ ఎలాంటి జాడ క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో క‌రిష్మా ఇంటికి డోర్‌కు నోటీసులు అంటించారు. బుధ‌వారం రోజు హాజ‌రు కావల‌సి ఉన్న‌ప్ప‌టికీ క‌రీష్మా త‌ప్పించుకు తిరుగుతుండ‌డంతో మ‌రోసారి నోటీసులు ఇచ్చి ఆ త‌ర్వాత త‌గిన నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని తెలుస్తుంది.