ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణె తప్పించబడిన తర్వాత మొదలైన వివాదం మరింత ముదిరింది. ఇటీవల దీపికా పీఆర్ టీం సినిమాకు సంబంధించిన కథను లీక్ చేసిందంటూ వార్తలు రావడం, బాలీవుడ్ మీడియా లో పెద్ద చర్చకు దారితీసింది.
దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించాడు. స్పిరిట్ నుంచి దీపికను తొలగించి, ఆమె స్థానంలో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీను తీసుకోవడమే ఈ వివాదానికి ఆరంభం. ఈ పరిణామంతో దీపికా సన్నిహితులు, ఆమె పీఆర్ టీం కథను ముందుగానే లీక్ చేస్తూ ప్రచారం ప్రారంభించారని వంగా ఆరోపించారు.
“ఒక నటికి కథ చెప్పినప్పుడు, నా పనిపై నమ్మకం ఉంచుతా. ఇలాంటివి చేయడం మీ అసలైన రూపాన్ని చూపిస్తుంది. ఇది మీ ఫెమినిజమా?” అంటూ ప్రశ్నించారు. “మీరు కథను లీక్ చేస్తే నాకు ఫరక్ పడదు. నేను సినిమాలకు జీవితాన్ని అంకితం చేశా. మీ పీఆర్ గేమ్స్‌తో నన్నేం కదిలించలేరు. నా కథపై నన్నే నమ్మకం ఉంది” అంటూ వంగా తేల్చి చెప్పారు. ఈ వివాదంతో స్పిరిట్ సినిమా చుట్టూ హైపే కాకుండా, మరోమారు దర్శకుడి స్పష్టత, ధైర్యం స్పష్టమవుతోంది.