ఎట్టకేలకు `బిగ్ బాస్ సీజన్-4` ప్రారంభమైంది. మళ్లీ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోకు ఆదరణ ఏ స్థాయిలో దక్కుతుందో! ఈ గేమ్ షోని తిట్టిపోసే వాళ్లుకూడా భారీగానే ఉన్నారు. ఇదొక చెత్త గేమ్ షో అని..తెలుగు సంప్రదయాన్ని తుంగలోకి తొక్కి కల్చర్నే నాశనం చేస్తున్నారని బిగ్ బాస్ లోని కొన్ని టాస్క్ ల కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏకంగా 90 రోజులు పాటు ఆడవాళ్లు..మగవాళ్లు కలిసి ఓ సెట్లో ఉండటం ఏంటని? అదీ పెళ్లైన ఆడవాళ్లు…పెళ్లికాని మగవాళ్లు ఉండటం ఎంత మాత్రం సబబు కాదని మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. అయినా ఈ విమర్శల్ని బిగ్ బాస్ నిర్వహకులు పట్టించుకోలేదు.
ఎవరి పని వారిదే అన్నట్లు ముందుకెళ్లిపోతున్నారు. ఇక సీజన్ -3 ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున కాస్టింగ్ కౌచ్ అరోపణల్ని బిగ్ బాస్ ని వేడెక్కించాయి. కమిట్ మెంట్ ఇస్తేనే బిగ్ బాస్ లో ఛాన్స్ లేదంటే ఇంటికి పంపిచేస్తున్నారని ఓ ఫేమస్ యాంకర్ సహా పలువురు ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ -4ని వీక్షించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బిగ్ బాస్ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. షో చూస్తుంటే హిమాలయాల్లో సాంస్కృతిక సంఘాన్ని తీసుకొచ్చి మురికి కుంటలో పడేసినట్లు ఉందని మండిపడ్డారు. షో వైభవం చూస్తుంటే విజయ్ మాల్యా జీవించే భవనాల కంటే విలాసవంతంగా ఉందన్నారు.
ఆడవాళ్లను..మగవాళ్లను 90 రోజులు సెట్లో పెట్టడం వెనుక అసలు కథేంటి? అని ప్రశ్నించారు. అభిజిత్ ని నాగార్జున ముగ్గురు హీరోయిన్లలలో ఎవర్నీ ముద్దు పెట్టుకుంటావ్ అనడంపై నారాయణ మండిపడ్డారు. యువతీ , యువకులకు నాగార్జున ఇచ్చే సందేశం ఇదేనా! ఇదో రకమైన సాంస్కృతిక దోపిడి అని..కళామాతల్లిని అవమాన పరుస్తున్నారని దుయ్యబెట్టారు. నారాయణ ఇలాంటి కామెంట్లు చేయడం కొత్తేం కాదు. గతంలోనూ బిగ్ బాస్ షోపై ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. సినిమాల్లో హద్దు మీరిన సన్నివేశాలపై…బస్సులపై అంటించిన అశ్లీల పోస్టర్లపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు.