మారిని ట్రెండ్‌ని పట్టుకోలేక, తన మార్కు రొటీన్ చిత్రాల్లో నటించలేక సతమతమౌతున్న హీరో అల్లరి నరేష్. వరుస ఫ్లాపుల తరువాత అల్లరి నరేష్ నటిస్తున్న విభిన్న కథా చిత్రం `నాంది`. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నరేష్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త దనం కోసం చేస్తున్న చిత్రమిది. ఇందులో నరేష్ అండర్ ట్రైల్ ఖైదీగా అత్యంత సహజత్వంతో సాగే పాత్రలో కనిపించబోతున్నారు.
కరోనా వైరస్ ప్రబలడానికి ముందే ఈ చిత్రం 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవలే ప్రభుత్వం మళ్లీ షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో హైదరాబాద్‌లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో షూటింగ్ మొదలుపెట్టారు. మూడు రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ చిత్ర బృందం సడన్‌గా షూటింగ్ ఆపేసింది. దీంతో చిత్ర యూనిట్‌లో కొంత మందికి కరోనా సోకిందని ఆకారణంగానే షూటింగ్ నిలిపివేశారని ప్రచారం మొదలైంది. ఈ వార్తల్ని తాజాగా చిత్ర బృందం ఖండించింది. ఈ తప్పుడు వార్తల్ని నమ్మెద్దని స్పష్టం చేసింది.
బుధవారం కేవలం వర్షం కారణంగానే చిత్రీకరణ ఆపామని, అంతకు మించి వేరే కారణం లేదని వెల్లడించింది. అల్లరి నరేష్ నటిస్తున్న 57వ చిత్రమిది. కామెడీ చిత్రాల్లో నటించిన ఆకట్టుకున్న నరేష్ చాలా కాలం తరువాత పూర్తి భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఓ సన్నివేశంలో న్యూడ్‌గా కూడా నటించడం సంచలనంగా మారింది.
ఇక కెరీర్ పరంగా ఇప్పటికే 50 సినిమాలు శరవేగంగా పూర్తి చేసిన హీరోగా రికార్డుల్లో ఉన్న నరేష్ కెరీర్ ఇటీవల బాగా నెమ్మదించింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. కంబ్యాక్ కోసం ట్రై చేస్తూ మహర్షిలో నటించాక.. వరుసగా కమిట్ మెంట్లు పెరిగినా రిలీజ్ లు అయితే కనిపించడం లేదు.