Uber Advance Tip: ఉబెర్ అడ్వాన్స్ టిప్‌పై హంగామా.. కేంద్రం నోటీసులు

వేగంగా క్యాబ్ అందుకోవాలంటే ముందుగా టిప్ ఇవ్వాలన్న ఉబెర్ విధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రవాణా సేవల సంస్థ ఉబెర్ ఇటీవల పరిచయంచేసిన ‘అడ్వాన్స్ టిప్’ ఫీచర్‌పై వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం దీనిపై కఠినంగా స్పందించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా ఈ విషయాన్ని పట్టించుకోవడంతో, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రంగంలోకి దిగింది.

ఉబెర్‌కు నోటీసులు జారీ చేసి, ఈ విధానం వెనుక ఉన్న లక్ష్యాలు మరియు ప్రయోజనాలపై పూర్తిస్థాయి వివరణ కోరింది. ఈ వ్యవహారంపై మంత్రి ప్రహ్లాద్ జోషి తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. “వేగవంతమైన సేవల కోసం వినియోగదారులపై టిప్ పేరుతో ఒత్తిడి తగలడం తగదు. ఇది నైతికంగా తప్పు. సేవలు ఇచ్చిన తర్వాతే టిప్ ఇవ్వాలా, వద్దా అనేది ప్రయాణికుడి ఇష్టాన్ని ఆధారపడి ఉండాలి” అని స్పష్టం చేశారు.

ఇలాంటి విధానాలు అనుచిత వ్యాపార ధోరణుల్లోకి వస్తాయని కూడా మంత్రి అన్నారు. వినియోగదారులకు స్పష్టత, న్యాయం, పారదర్శకత కల్పించాల్సిన బాధ్యత సంస్థలపై ఉందని గుర్తుచేశారు. ఇక ఉబెర్ కంపెనీ మాత్రం ఈ టిప్ విధానం పూర్తిగా డ్రైవర్ల కోసం అని వివరణ ఇచ్చింది. ముందస్తుగా ఇచ్చే టిప్‌ను డ్రైవర్‌కి ప్రోత్సాహకంగా అందిస్తామని పేర్కొంది.

అలాగే అవసరమైతే ప్రయాణికుడు ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది. అయినప్పటికీ, వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఇది ఉందని భావించిన సీసీపీఏ, ఉబెర్ సమాధానాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనుంది. ఇప్పుడు అందరి దృష్టీ ఉబెర్ ఎలా స్పందిస్తుందనేదానిపైనే ఉంది.