రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రానిపక్షంలో.. తనకు అవే చివరి ఎన్నికలు అని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో… ఇంతకాలం సంపాదించుకున్న రాజకీయ తెలివితేటలను పెట్టుబడిగా పెట్టడంతోపాటు.. మరికొన్ని శక్తులను కూడగట్టుకుని ముందుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు బాబు! అందులో భాగంగా.. లైఫ్ అండ్ డెత్ పరిస్థితుల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఇటు జనసేనకు తోడు అటు బీజేపీ కూడా కలిస్తే… 2014 ఫలితాలు పునరావృతం అవుతాయని బాబు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ… వాటికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.
బీజేపీతో స్నేహబంధం విషయంలో చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేస్తుంటే.. పదడుగులు వెనక్కి పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న బాబుకు… సోము వీర్రాజు రూపంలో బలమైన వ్యతిరేకత ఎదురవుతున్న పరిస్థితి. బాబుతో కలిసి అడుగులు వేయడానికి ఆయన ఏమాత్రం సిద్ధంగా లేరన్నది తెలిసిన విషయమే! అయితే… బాబును కలుపుకోవడం లేదనో ఏమో కానీ… సోము వీర్రాజు వైఖరిపై గతకొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్… అలకపాంపు ఎక్కారు! ఫలితంగా… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి హ్యాండ్ ఇచ్చారు.
ఈ క్రమంలో… తాజాగా ఢిల్లీ వెళ్లిన పవన్… తమ పొత్తు బలంగా ఉండాలంటే… ఆ బంధానికి టీడీపీ అనే తాడు అవసరం అన్నస్థాయిలో చెప్పారని వార్తలొచ్చాయి. దీంతో… తనమాట ఎలాగూ వినరు కాబట్టి… పవన్ తో బాబు నరుక్కొస్తున్నారని అంతా భావించారు. అయితే ఈ పరిస్థితుల్లో బాబుతో పరిపూర్ణమైన రాజకీయ వైరం ఉన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా బీజేపీలో చేరారు.
అవును… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన… ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పలువురు జాతీయ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు. దీంతో… బాబు – బీజేపీ కలయికపై నీలినీడలు దట్టంగా కమ్ముకున్నాయనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఎందుకంటే… ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి – చంద్రబాబు నాయుడి కుటుంబాలకు మధ్య సుదీర్ఘ కాలంగా రాజకీయ వైరం వుంది. బాబుకు వ్యతిరేకంగా కిరణ్ దీటైన రాజకీయాలు చేశారు. ఇక దివంగత వైఎస్సార్ ప్రోత్సాహంతో బాబును కిరణ్ రాజకీయంగా ఓ ఆట ఆడుకున్నారు. ఇలా ఎప్పటినుంచో వీరి మధ్య వ్యక్తిగతంగా కూడా సరైన సంబంధాలు లేవు! ఫలితంగా… ఇక బీజేపీ – టీడీపీ పొత్తు పొడిచే పరిస్థితులు ఆల్ మోస్ట్ లేవని అంటున్నారు విశ్లేషకులు!
మరి ఇప్పుడు హస్తిన కేంద్రంగా… “బాబుతో పొత్తు ఉండాలని జనసేన అధినేత పవన్ – అంతకు మించిన చారిత్రక తప్పిదం మరొకటి లేదని కిరణ్ కుమార్ రెడ్డి” బీజేపీ పెద్దల వద్ద చెబుతారనే కథనాలొస్తున్న తరుణంలో… వీరి సమర్ధత మధ్య బాబు భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు రాజకీయ పండితులు!