Allu Bobby: వరుణ్ తేజ్ హీరోగా గని చిత్రంతో తొలిసారి నిర్మాతగా తన లక్ ను పరీక్షించుకోబోతున్నాడు అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ. సిద్దు ముద్దతో కలిసి నిర్మించబోతున్న ఈ సినిమాను ఇప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న గీతా ఆర్ట్స్ లో కాకుండా అల్లు బాబీ కంపెనీ అనే బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక చిన్నప్పటి నుంచీ సినీ పరిశ్రమతో టచ్ లో ఉన్నా, అవి చూడడం వరకే. కానీ ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది మాత్రం తనకు ఒక సినిమా తీసేవవరకూ తెలియదని ఈ నిర్మాత చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఒక్కోసారి హీరో లేదా హీరోయిన్ లేదా డైరెక్టర్ లాంటి వారి వెనక ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అనుభవం వల్ల నేర్చుకునే పాఠాలు చాలా నేర్పిస్తాయి. అదే విధంగా అల్లు బాబీ కూడా గని సినిమాతో చాలా నేర్చుకున్నానని చెప్పారు. కరోనా రావడంతో ఈ సినిమా కొంతకాలం ఆగిపోయిందని, ఆ టైం లో వేసిన స్టేడియం సెట్ కూడా వేస్ట్ అయిందని ఆయన అన్నారు. ఇక ఆ తర్వాత అంతా బాగుంది అనుకున్న సమయంలోనే వరుణ్ తేజ్ ప్రాక్టీస్ చేస్తుండగా భుజానికి గాయం అయ్యి ఈ సినిమా ఇంకా లేట్ కావడానికి కారణం అయింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా తనకు చాలా విషయాలు తెలిసేలా చేసిందని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కొంత మంది అల్లు అర్జున్ ను, మెగాస్టార్ చిరంజీవితో పోలుస్తారు. కానీ దానికి తాను పూర్తిగా వ్యతిరేకం అని బాబీ తెలిపారు. ఎందుకంటే చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అదే తను గానీ లేదంటే అల్లు అర్జున్ గానీ చూసుకుంటే తాము అల్లు రామలింగయ్య మనవల్లుగా, అల్లు అరవింద్ కుమారులుగా ఇండస్ట్రీకి వచ్చాము అని ఆయన అన్నారు. మెగాస్టార్ ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చామని, అలాంటి ఆదర్శవంతమైన వ్యక్తితో, అల్లు అర్జున్ ని పోల్చడం ఏంటని ఆయన అన్నారు. ఇక ఇది పక్కన పెడితే బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 8 న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.