RGV: మెగాస్టార్‌పైనా కామెంట్స్ చేశారు.. : వైరల్ అవుతోన్న రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు

RGV: ఎప్పుడూ కాంట్రవర్షియల్ సినిమాలు తీస్తూ వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి కూడా అలాంటి మూవీతోనే ప్రేక్షకుల ముందకు వచ్చి, చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఎవరికీ భయపడకుండా తన కి।ష్టమైన రీతిలో సినిమాలు తీయడం ఆయనకు కొత్తేమీ కాదు. తాజాగా అలాంటి సినిమానే తెరకెక్కించారు ఆర్జీవీ. డేంజరస్ అనే సినిమా తెలుగులో ‘మా ఇష్టం, హిందీలో ‘ఖత్రా’అనే టైటిల్ తో విడుదలవుతున్న ఈ సినిమా మొదటి నుంచీ విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే లెస్బియన్ కథాంశం నేపథ్యంలో తీసిన ఈ సినిమా విడుదలపై ఇటీవలే కోర్టు స్టే ఇచ్చింది. దానికి కారణం నట్టి కుమార్. తనకు రావల్సిన రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి వచ్చేవరకూ మా ఇష్టం సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని నట్టి కుమార్ కేసు వేయడంతో ఈ వివాదం మొదలైంది. అంతే కాకుండా వర్మపై తీవ్ర స్థాయిలో నట్టి కుమార్ వ్యాఖ్యలు చేశారు.

ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, నట్టి కుమార్ ఇచ్చిన నోటీసులకు తన లాయర్ సమాధానం ఇస్తారని. తనపై ఆయన వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు సమాధానం ఎలా చెప్పాలో తనకు తెలుసని అన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎవరిమీదో ఒకరి మీద ఆరోపణలు చేయడం నట్టి కుమార్‌కు అలవాటే అంటూ విరుచుకుపడ్డారు. గతంలో చిరంజీవి, సురేశ్‌బాబు మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని వర్మ ఈ సందర్భంలో గుర్తు చేశారు. ఇండస్ట్రీలో నట్టి కుమార్ ఎలాంటి వాడో అందరికీ తెలుసని, తన కొడుకు, కుమార్తెతో తీసిన సినిమాకు పెద్దగా ప్రమోషన్‌ చేయలేదని, రావల్సిన కమీషన్‌ రాలేదని కొందరిని ఆయన దూషించాడని వర్మ తెలిపారు.

ఇక తాను తీసిన ‘మా ఇష్టం ’ సినిమా విడుదల వాయిదాకు నట్టికుమార్ కారణం కాదని, వేరే కారణం ఉందని ఆర్జీవీ చెప్పారు. కేవలం లెస్బియన్ కథాంశంతో రూపొందించడం వల్లే చాలా థియేటర్లు ముందుకు రావడం లేదని వర్మ ఆరోపించారు. దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు వర్మ. నట్టి కుమార్‌కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. కాబట్టి ఆయన గురించి ఇకపై ఎక్కడా మాట్లాడనని పేర్కొన్నారు. చట్ట పరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని తన అడ్వకేట్ చూసుకుంటారని ఆర్జీవీ వివరించారు.