లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఘటన రోజురోజుకు మరింత వివాదస్పదంగా మారుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వేడుకలో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. రాజకీయంగా వివాదాస్పదమైన ఈ కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫంక్షన్‌లో “150 మేకలు.. 11 మేకలు” అంటూ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ కామెంట్స్ వైసీపీ గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నదాన్ని ఉద్దేశిస్తూ చేసిన సెటైర్‌గా భావిస్తున్నారు. దీంతో వైసీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ #BoycotLaila హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ ఇప్పటికే సినిమా యూనిట్ తరఫున క్షమాపణ చెప్పినప్పటికీ, బాయ్‌కాట్ ట్రెండ్ మాత్రం తగ్గడం లేదు. ఈ వివాదం మరింత పెద్దదిగా మారిపోతోంది. ఇప్పటికే లక్షకు పైగా ట్వీట్స్ రావడంతో ఈ విషయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, పృథ్వీ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాడు. ఇంటర్నెట్‌లో నిరంతరం వచ్చే విమర్శలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలుస్తోంది. హై బీపీ కారణంగా ఆయన అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని సమాచారం. ఈ మేరకు ఆసుపత్రి బెడ్‌పై పృథ్వీ ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమా ప్రమోషన్ కోసం నిర్వహించిన ఈవెంట్ రాజకీయ వివాదానికి దారితీస్తుందని ఊహించని యూనిట్, ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. మరి పృథ్వి భవిష్యత్తులో ఈ వివాదంపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.