ఇప్పటి తరంలో చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రొటీన్ తీసుకుంటున్నారు. దానిలో భాగంగా పనీర్‌ను ఎక్కువగా ఆహారంలో చేర్చుతున్నారు. జిమ్‌కు వెళ్లే వారైనా, డైట్ లో ఉన్న వారైనా.. పనీర్ అంటేనే ప్రొటీన్ అనే విశ్వాసంతో ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ మనం మార్కెట్‌లో కొనుగోలు చేసే పనీర్ నిజంగా మంచిదేనా.. కచ్చితంగా పాలతోనే తయారు చేసినదేనా.. అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ తలెత్తాలి. ఎందుకంటే ఇప్పుడు నకిలీ పనీర్ దారుణంగా వాడుకలోకి వస్తోంది.
కల్తీ పనీర్ అంటే ఏమిటి: ప్రస్తుతం చాలా స్వీట్ షాపులు, చిన్న రెస్టారెంట్లు, కొంత మంది మోసగాళ్లు కల్తీ పాలు, లేదా స్టార్చ్, కృత్రిమ నూనెలతో పనీర్‌ను తయారు చేసి విక్రయిస్తుంటారు. అసలైన పనీర్ కంటే గోరు వెచ్చని పాలను విరిచి తయారు చేస్తారు. అయితే కల్తీ పనీర్ రుచి కూడా అలాగే ఉండటంతో.. ఎవరికీ తేడా తెలియదు. కానీ ఇలాంటి పనీర్‌లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలు, కడుపునొప్పులు, లివర్, కిడ్నీలకు కూడా సమస్యలు తలెత్తించే అవకాశం ఉంది.
ఇంట్లోనే పనీర్ నకిలీదో లేదో ఇలా పరీక్షించండి: ఇంట్లో ఉన్న అయోడిన్ టింక్చర్‌తో సరళ పరీక్ష చేయవచ్చు. చిన్న ముక్క పనీర్ తీసుకుని వేడి నీటిలో రెండు నిమిషాలు ఉడకబెట్టి బయటకు తీసి ప్లేట్‌లో పెట్టండి. దాని మీద అయోడిన్ టింక్చర్ రెండు చుక్కలు వేయండి. ఒక్కసారిగా ఆ ముక్క నీలం లేదా నల్లని రంగులోకి మారితే అది కల్తీ పనీర్ అని అర్ధం. ఎందుకంటే స్టార్చ్ ఉన్నప్పుడు అయోడిన్ దానితో రియాక్ట్ అయ్యి నీలం రంగు చూపిస్తుంది.
నకిలీ పనీర్ వల్ల కలిగే హాని: ఇలా కల్తీ పనీర్ తినడం వల్ల ఆహార విషమయం, కడుపు జబ్బులు, రసాయనాలు శరీరంలో పేరుకుని కిడ్నీ, లివర్‌కి పెద్ద సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారికి ఇది మరింత ప్రమాదకరం.
ఏం చేయాలి: పనీర్ కొనేటప్పుడు మోసపోకుండా చూడాలి. ఎప్పుడూ బ్రాండెడ్ ప్యాక్ ఉన్నదాన్ని మాత్రమే తీసుకోవాలి. లేదా మిల్క్ ప్రొడక్ట్స్‌కి FSSAI నంబర్ ఉన్న షాపుల నుండి మాత్రమే కొనండి. సాధ్యమైతే ఇంట్లోనే పనీర్ తయారు చేసుకోవాలి. అదే ఆరోగ్యానికి మేలు. సింపుల్‌గా చెప్పాలంటే.. మనం తింటున్నది శుద్ధమైనదేనా అని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి, చిన్న టెస్టులతో కల్తీ పదార్థాలకు గుడ్‌బై చెప్పొచ్చు.
