తారకరత్నకు నివాళి.. విజయసాయితో చంద్రబాబు ఎమోషనల్!

సీనియర్ ఎన్టీఆర్‌ మనమడిగా ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో నందమూరి తారకరత్న. తీవ్ర గుండెపోటుకు గురైన అయన గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయన మరణంతో టాలీవుడ్​లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయన భౌతికకాయాన్ని చివరిసారిగా చూసేందుకు తరలి వస్తున్నారు.

అలానే తారకరత్న భౌతికకాయానికి కడసారిగా చూసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వచ్చారు. నివాళులు అర్పించారు. హైదరాబాద్ మోకిలలోని తారకరత్న నివాసానికి వచ్చి అంజలి ఘటించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.

ఈ క్రమంలోనే తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వచ్చిన చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఒక దగ్గర కలుసుకున్నారు. తారకరత్న చికిత్స తీరు గురించి విజయసాయి చంద్రబాబుకు వివరించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. అంతకుముందు NTRతోనూ విజయసాయి మాట్లాడారు. కాగా, తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు విజయసాయి వెళ్లి పరామర్శించారు. తారకరత్నను దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు.

ఇకపోతే విజయసాయి రెడ్డికి తారకరత్న స్వయంగా అల్లుడు వరస అవుతారు. విజయ్ సాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్యను నందమూరి తారక రత్న వివాహం చేసుకున్నారు. దీంతో విజయ సాయి రెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారు. అలేఖ్య సినీ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు.

ఈ క్రమంలోనే ఆమె తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకి గాను కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అనంతరం పెళ్లి చేసుకున్నారు. అలా తారకరత్న అలేఖ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల విజయసాయిరెడ్డి తారకరత్న మధ్య మామ అల్లుళ్ళ అనుభందం ఏర్పడింది.

కాగా, తారకరత్న 2002లో ఒకటో నెంబరు కుర్రాడు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, విజేత, అమరావతి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త సిరియాళ, కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని, సారథి చిత్రాల్లో నటించారు. మొత్తం 23 చిత్రాల్లో హీరో, ప్రతినాయక, క్యారెక్టర్ రోల్స్ పోషించి మెప్పించారు.