తెలంగాణలో బెనిఫిట్ షోలకు బ్రేక్ – నిర్మాతలకు షాక్

తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన నిర్ణయం సినీ ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఇటీవల విడుదలైన పుష్ప 2: ది రూల్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన తరువాత అల్లు అర్జున్ సహా పలువురిపై కేసులు నమోదు చేయడంతో పాటు పోలీసులు విచారణ చేపట్టారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్యాన్ ఇండియా చిత్రాలపై పెద్ద ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనవరిలో విడుదల కానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ చిత్రాలకు ముందస్తు షోలను ఆశించిన నిర్మాతలు ఈ నిర్ణయంతో దెబ్బతిన్నారు. బెనిఫిట్ షోల ద్వారా వచ్చే అదనపు ఆదాయం లేకపోవడం నిర్మాతల ఆర్థిక లెక్కలను గందరగోళంలో పడేస్తుంది.

నైజాంలో ముందస్తు షోలకు గతంలోనే కొన్ని నియంత్రణలు విధించగా, ఈసారి పూర్తిస్థాయిలో రద్దు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం ప్రభావం ఏపీ రాష్ట్రంపై ఎలా ఉంటుందో చూడాలి. ప్రీమియర్లకు భారీ టికెట్ ధరలతో మంచి ఆదాయాన్ని ఆశించిన నిర్మాతలకు ఇది పెద్ద చిక్కుగా మారే అవకాశం ఉంది. అభిమానుల క్రేజ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాల హడావుడి కూడా ఇలాంటి చర్యలకు కారణమవుతున్నాయి.

గతంలో ఇలాంటి నిర్ణయాలు కొంతకాలానికే పరిమితమయ్యాయి. మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తరువాత మినహాయింపులు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ, ఈసారి పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగుతుందా లేదా అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంది. అభిమానుల ఉత్సాహం, టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకునే భవిష్యత్ నిర్ణయాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.